పుట:Bhoojaraajiiyamu.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వంజరుని కథ

191


క.

మే నెంతయుఁ బులకింపం
గా నప్పుడు ప్రాణనాథుఁ గౌఁగిట నిడిన
ట్లైన, మది సంశయించుచు
వానిం గొని పోయి పెంచె వనిత ముదమునన్.

103


క.

దినదిన మొక్కొక కళగాఁ
బెనుపొందెడుచంద్రుమాడ్కిఁ బెరిగె నతం డే
డెనిమిది దినములనాఁటికి
మనసిజుకైవడి నతిసుకుమారాకృతితోన్.

104


వ.

ఇట్లు సుయౌవనుండై యావనిత పై నివ్వటిలు తనకోర్కి వితర్కించి దాని
కి ట్లనియె.

105


ఉ.

'మాతవు నీవు, నిన్నుఁ గని మానస మారయ నేమి పాపమో
నాతి! యధర్మలక్షణమునం జొరఁ దాటెడు నోజ లేక, నా
కీతలఁ పేల పుట్టె నొకొ యేగతి నేఁగుదు నొక్కొ' నావుడుం
చేతులు మోడ్చి యవ్వనిత చెచ్చెర ని ట్లని పల్కె వానితోన్.

106


ఉ.

'నీవు శిశుత్వ మొంది యవనిం బడి యుండఁగ నెత్తుకొన్నమ
ద్ఛావము నిట్లయై వెఱఁగుపాటు జనింపఁగఁ దెచ్చి పెంచితిం
దేవ! నిజంబు చెప్పుము, మదీయమనోహరుఁ డైన వంజర
క్ష్మావిధు నట్ల తోఁచెదవు కావు గదా యనుమాన మయ్యెడున్.'

107


ఆ.

అనిన నతఁడు దెలిసి 'యనుమాన మేటికి
వంజరుండ నగుదుఁ గంజనయన!
వెడలఁ బడితిఁ బొమ్ము విప్రాదులగువారి
మూఁడుశాపములను ముక్తి వడసి.'

108


వ.

అనిన నయ్యతివ వాని కి ట్లను, 'విప్రాదులనువా రెవ్వరు? వారు నిన్ను
శపింపం కారణం బేమి? నీ విప్పుడు శాపవిముక్తుండ నైతిం బొమ్మనుట
యేమిటం జేసి?' యనిన నవ్విటచతుష్టయంబు వవితావాదనిమిత్తంబునం దన
సమ్ముఖంబునకు వచ్చుటయుఁ, దానుఁ దీర్చినతగవు శూద్రునకుఁ దక్కఁ
దక్కినమువ్వురకు నసహ్యం బైనం గోపించి, శాపంబు లిచ్చిన తెఱంగునుం
జెప్పి మఱియు ని ట్లనియె.

109