పుట:Bharatiyanagarik018597mbp.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశేషాంశములు గొన్ని తెలియనగుచున్నవి. ఈ కాలమునందీ ద్వీపమునకు దక్షిణ హిందూదేశముతో నెక్కుడు సంబంధముండెడిది. బోర్నియో ద్వీపమున మిక్కిలి ప్రాచీనములగు శాసనములు లభించినవి. వీనిలిపి దక్షిణ హిందూదేశము నందలి ప్రాచీన పల్లవశాసనములను బోలియుండుటచే చరిత్రకారు లియ్యవి క్రీ. శ. 4 వ శతాబ్దమునాటివని నిర్ణయించిరి. ఈ సంస్కృతభాషాశాసనములనుండి యీ ప్రాంతమునం దశ్వవర్మ తనయుడగు మూలవర్మ రాజ్యమేలెననియు, నాతడు బ్రాహ్మణులచే శిలాయూసములను నిర్మింపజేసి 'బహుసువర్ణక' మను యజ్ఞమును జేసెననియు దెలియుచున్నది. ఈ రాజనామములు పల్లవ రాజులగు స్కందవర్మ, మహేంద్రవర్మ మున్నగువారి నామములవలె నున్నవి. యజ్ఞములను బ్రాహ్మణ సన్మానమును జేయుటయుగూడ పల్లవుల యాచారములే.

పశ్చిమ జావా :- క్రీ. శ. 5 వ శతాబ్దమునకు బశ్చిమ జావారాజ్యము ప్రసిద్దికెక్కినది. పల్లవగ్రంథలిపితో లిఖింపబడిన యీ కాలపు శాసనములు కొన్ని పూర్ణవర్మయను రాజునుగూర్చి విశేషాంశములను దెలుపుచున్నవి. ఈతండు తరుమర నగరాధీశ్వరుడు. చంద్రభాగా, గోమతియను పేరిట రెండు కాల్వల నితడు త్రవ్వించెను. ఈతని రాజ్యకాలమున 'ఫాహియన్‌' పశ్చిమ జావాకు వచ్చెను. అప్పటి కచట బౌద్దమతము ప్రబలియుండక దేశమునం దనేకులగు బ్రాహ్మణు లుండిరట. ఈ దేశమునకును చైనాకును వర్తక వ్యాపారము జరుగుచుండెడిది. క్రీ. శ. 413 లో 200 మంది హిందూవర్తకులతో నిండియుండిన యోడపై ఫాహియన్ చైనాకు బయల్వెడలెను. క్రీ. శ. 423 లో కాశ్మీర రాజపుత్రుడగు గుణవర్మ యీ రాజ్యమున గొంత కాలము బౌద్దమత ప్రచారమొనర్చి, యటనుండి 'నంది' యను నొక హిందువు యోడలో చైనాకు పోయెను. క్రీ. శ. 6 వ శతాబ్దమున పశ్చిమ జావారాజ్యము క్షీణించినటుల చైనా దేశీయుల వ్రాతలనుండి తెలియుచున్నది. ఈ కాలపు రాజులలో నొక