పుట:Bharatiyanagarik018597mbp.pdf/73

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


చుండిరి. క్రీస్తుశకారంభమునకే యీ ద్వీపము హిందూమతము నవలంచినది. చైనాదేశీయులు శ్రీవిజయ రాజ్యమును "పాలెంబాన్‌గ్" (Palembang) అని పిలచిరి. 5 వ శతాబ్దమునందీ రాజ్యముండినదని వారు వ్రాసియున్నారు. 7 వ శతాబ్దమున సుమాత్రాకును మలేద్వీపకల్పమునకును నడుమగల పంకాద్వీప మీ రాజ్యమున జేరియుండెను. మఱుసటి శతాబ్దమునం దీ రాజ్యము మలేదేశమున చాలవరకును వ్యాపించెను. ఈ కాలమున మధ్యజావాద్వీపము శైలేంద్ర రాజులచే జయింపబడినది. ఈ రాజులలో నొకడిచ్చట "కలన్సస్" అనుచోట తారాదేవి కొక యాలయమును గట్టించెను. ఇందత్యద్భుతములగు శిల్పములున్నవి. శ్రీవిజయరాజ్య నౌకాదళమును చంపారాజ్యము (Annam) నకును కాంభోజ రాజ్యము (Cambodia) నకును గూడ నేగి విజయములను గాంచినవి. ఈశైలేంద్ర రాజులు మహాయాన బౌద్దులు. నాలందా విద్యాలయాచార్యుడగు ధర్మపాలుడిచటనే దనయవసాన కాలమును గడపెను. ఈ రాజుల శాసనములు చాలభాగముత్తర హిందూదేశమున 8, 9 వ శతాబ్దములందుండిన లిపిలోనే వ్రాయబడియున్నవి. కానపాలవవంశీయుల కాలమున మగధ వంగదేశములలో బ్రబలిన మహాయాన బౌద్దమే యీ కాలమున సుమాత్రాద్వీపమునకు వ్యాపించెనని స్పష్టమగుచున్నది. ఇంతకు పూర్వమిట హిందూశైవమతము ప్రబలినది. ఈ రెండు మతముల సంమిశ్రణమువలనను తాంత్రిక సిద్దాంత మీద్వీపమున ప్రబలినది. 10, 11 శతాబ్దములలో దక్షిణహిందూదేశమునుండి చోళరాజులు సువర్ణద్వీపముపై ననేకసారులు దాడి వెడలిరని యిదివరలో దెలిపితిమి. ఇటులు చోళులకు సామంతులగుటచేతనే శైలేంద్ర రాజులిర్వురు నాగపట్టణమున - బౌద్దాలయమును నిర్మింపగల్గిరి. ఈసమయమున శ్రీ విజయరాజ్యమునకు లోబడియుండిన జావాద్వీపము స్వతంత్రించినది.