పుట:Bharatiyanagarik018597mbp.pdf/74

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


12 వ శతాబ్దమున శ్రీ విజయరాజ్యము మిగుల బ్రఖ్యాతివహించి, జావా రాజ్యముతో సరియగు పదవి నలంకరించినది. 13 వ శతాబ్దము సుమాత్రాద్వీప చరిత్రమున నిరుపమమైనది. ఈ కాలమున చైనా చక్రవర్తి పక్షమున సుంకాధికారిగ నుండిన యొక చైనా దేశీయుడు సువర్ణద్వీపమును గూర్చి యీ క్రింది విశేషాంశములను వ్రాసియున్నాడు.

"శ్రీ విజయ రాజులు నౌకావిహార మొనర్చునపుడు బంగారుబల్లెములను ధరించుభటులు వారితో నేగుదురు. ప్రజలు నీటిపైన తెప్పలమీద నివసింతురు. వారేమియు సుంకములు నీయరు. యుద్దసమయములలో సైనికులు నాయకులను తామే యెన్నుకొనెదరు. శత్రువులను నిర్జించుట యందును, మృత్యువును దృణప్రాయముగ నెంచుట యందును వారగ్రగణ్యులు. వీరు సంస్కృతభాషనే వ్రాతకోతల కుపయోగింతురు. ఇచ్చటి శాసనము లతికఠినములు. వ్యభిచారమును జేసినవారికి మృత్యుదండనము విధింపబడును. ఇచటి రాజుచనిపోయినచో ప్రజలు శిరోముండనము జేయించుకొని తమ విచారమును బ్రకటింతురు. రాజభృత్యులు శవముతో సహగమనము జేయుదురు. క్రొత్తరాజులు సింహాసము నెక్కుటకు బూర్వము బంగారముతో దమప్రతికృతిని చేయింతురు. ప్రజలీ విగ్రహమునకు గానుకల నర్పించెదరు. శైలేంద్రవంశీయులకు "నాగరాజ" యనునది బిరుదము. ఈ దేశీయులు విదేశములనుండి ముత్యములు, పన్నీరు, ఇంగువ, దంతము, పగడములు దూదిబట్టలు మున్నగువానిని దిగుమతిచేయుదురు. విదేశీయులిటనుండి బంగారము పట్టు, పంచదార, కర్పూరము మున్నగువానిని గొనిపోదురు."

ఈ కాలమున పహంగ్, కెడ, కిలంటన్ మొదలగు మలేప్రాంతములును, పశ్చిమ జావా, సింహళద్వీపములును మఱి పండ్రెండు రాజ్యములును శైలేంద్రవంశీయులు యాధిపత్యమునం దుండినవి. 13 వ