పుట:Bharatiyanagarik018597mbp.pdf/58

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


తోడి యుద్ధము నీతడు జయప్రదముగ నిర్వహించి, బర్మాలో కొంతభాగమును జయించెను. ఈకాలమునం దెల్లెడలను వైద్యశాలలు నెలకొల్పి బడినవి. క్రీ. శ. 14 వ శతాబ్దిలో కాంభోజరాజ్యము క్షీణించెను. రాజులు బలహీనులుగనుండిరి. ఒక వంకనుండి చంపాపాలకులును, మరియొక వంకనుండి నయాంరాజులును కాంభోజముపై ననేకసారులుదాడి వెడలి తుదకు దానిని రూపుమాపిరి.

కాంభోజదేశనాగరీకత యనేకవిషయములలో హిందూదేశనాగరీకతను పోలియున్నది. ఇచటి దేవాలయములు రాతితోను యిటుకలతోను కట్టబడినవి. ఇందు దక్షిణహిందూదేశమునందలి గ్రామదేవతలయొక్కయు, చిల్లరదేవతలయొక్కయు గుళ్ళవలె త్రికోణాకృతిగలవియు, పెద్దగోపురములు గలిగి విశాలములైనవియు, ననేకవిథములగు నాలయములు గలవు. ఆలయముచుట్టును ప్రహరీగోడయు ప్రధానద్వారముపై గోపురము నిటగూడనుండెడివి. శైవమతమీదేశమున బ్రధానముగనుండినది. శివుడు, పరమేశ్వర, త్ర్యంబక, శంభు, గౌరీశ, జగత్పత్యాదినామములతో నారాధింపబడుచుండెను. నందివాహన, నటరాజ, పంచముఖ - లింగరూపములు శిల్పమున గాంచనగుచున్నది. పాశుపత వీరశైవ శాఖలును, వేదాంత శైవమును నీరాజ్యమున ముఖ్యములుగ నుండినవి. ఇచట విశేషమగు నొక శైవాచారముండెడిది. రాజులు చంపాలోవలెనే తమపేరిట ముఖలింగములను స్థాపించుచుండిరి. వారికి మరణానంతరము శైవబిరుదము లొసంగబడుచుండెడివి. జయవర్మన్, ఈశ్వరలోక, యశోవర్మన్ పరమశివలోక, హార్షవర్మన్-రుద్రలోక మున్నగుబిరుదము లిందులకు నిదర్శనములు. పారమేశ్వర - స్పందవృత్తి పరమేశ్వర తంత్రమున్నగు శైవగ్రంథము లీదేశమున రచింపబడినవి. కాంభోజదేశమునందలి శైవమతమున శివవిష్ణులింగ, శంకరనారాయణ విగ్రహారాధన మింకొక నూతనాంశము. ఇచటను శివపాదమునకు దేవళములను గట్టించు టాచారమైయుండెను.