పుట:Bharatiyanagarik018597mbp.pdf/59

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఉమ, పార్వతి, భవాని, గౌరీరూపములలో శక్తియు, శివ, విష్ణు, బ్రహ్మ, సరస్వతి, గంగా, శ్రీ, చండీ, గణేశ, గరుడ, నంది, కాళ్యాది యితరదేవతలు నీదేశమునం దారాధింపబడుచుండిరి. క్రీ. శ. 7 వ శతాబ్దమున బౌద్దమత మీదేశమున ప్రబలినప్పటినుండియు మైత్రేయ, అవలోకితేశ్వర, వజ్రపాణి, ప్రజ్ఞాపారమితా, దివ్యాదేవి, లోకనాథాది మహాయాన బౌద్దదేవత లారాధింప బడుచుండిరి. చంపాలోవలె కాంభోజదేశమునగూడ హిందూవాఙ్మయము వ్యాపించినది. ఋగ్వజుస్సామవేద పారంగులెందరో యిటనుండిరి. తంత్రములు, నాగమములును, రామాయణ మహాభారతములు నిచ్చటివారికి కరతలామలకములుగ నుండినవి. శాసనములలో వేదాంతజ్ఞానసారులును, స్మృతిపథనిరతులు, సష్టాంగయోగ ప్రకటితకరణులునగు బ్రాహ్మణుల ప్రశంసగలదు. కాణాద న్యాయసూత్రములును, పతంజలి మహాభాష్యమును, జ్యోతిశాస్త్ర శబ్దశాస్త్రములును, ఆయుర్వేదమును, శిల్ప గీత నాట్యశాస్త్రములును, ధర్మశాస్త్రము, నర్థశాస్త్రము నీకాంభోజదేశమున విశేషముగ వ్యాప్తినందినవి. ఇచటి కట్టడములలో అంగ్‌కోర్‌వాట్ అను విష్ణ్వాలయము ముఖ్యమైనది. ఇందలి గోడలపై రామాయణ మహాభారత హరివంశములలోని ఘట్టణులు చిత్రింపబడినవి. అంగ్‌కోర్‌థాం అను రాజధానీనగరము దీని కెనయగును. హిందూకాంభోజ (Indo-Combodian) కళ కీరెండు కట్టడములు నుత్కృష్ట నిదర్శనములు._________________