పుట:Bharatiyanagarik018597mbp.pdf/57

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


దేశమునందుండెను. శుశ్రుతాచార్యుని వైద్యశాస్త్రమున యశోవర్మప్రవీణుడు. రెండవ జయవర్మ ప్రారంభించిన రాజధానిని పూర్తిచేసి దాని కీతడు యశోధరపురమని పేరిడెను. ప్రపంచమున కంతటికిని విస్మయముగొల్పు అంగ్‌కోర్‌థామ్ అను కట్టడ మీతనిచే నిర్మింపబడినది. క్రీ. శ. 944-968 నడుమ రాజ్యమేలిన రాజేంద్రవర్మకాలమున మహాయానబౌద్దమతము ప్రబలినది. బౌద్దదేవాలయములెన్నియో బయల్వెడలినవి. ఈరాజుపుత్రుడగు నైదవ జయవర్మకాలమున హిందూమత ముజ్జీవనము నందెను. ఈరాజు సోదరియగు ఇంద్రలక్ష్మి భారతదేశమునందలి యమునానదీ తీరమునుండి యేతెంచిన దివాకరుడను బ్రాహ్మణుని పెండ్లాడెను. దీనినుండి మాతృదేశమునుండి యీశాఖా రాజ్యముల కేగినవారల కాకాలమున జూపబడుచుండెడి గౌరవము తెలియుచున్నది. దివాకరు డెన్నియో యాలయములను స్థాపించెను. పిమ్మట సూర్యవర్మ క్రీ. శ. 1002-1049 నడుమ రాజ్యమునకు వచ్చెను. యోగీశ్వరుడను మహాపండితు డీతనియాచార్యుడు. ఈ రాజగురు నీకాలమున శైవమతమున కెంతయో ప్రాబల్యము లభించెను. శివాచార్యుడను మరి యొక పండితుడు వర్ణవ్యవస్థను సంస్కరించెను. పతంజలీ వ్యాకరణనేత్తయగు శంకరపండితుడుగూడ నీకాలముననే యుండెను. సూర్యవర్మ మహాతంత్రజ్ఞుడు. చైనా చంపారాజ్యములతో మైత్రినిపాటించి నీతడు అన్నాం రాజ్యముపై దండెత్తెను. క్రీ. శ. 1112-1152 నడుమ కాంభోజదేశమునకు నాటిరాజగు రెండవసూర్యవర్మ విశేషమగు ఖ్యాతి నొనగూర్చెను. ఈరాజు మలక్కాదీవులను జయించి తనరాజ్యమును విస్తరింప జేసెను. ఈకాలమున కాంభోజరాజ్యమునకు తూర్పున చంపారాజ్యమును, పడమట పెగూరాజ్యమును, దక్షిణమున మలేరాజ్యము నుండెడివి. చైనాకు రెండురాయబారముల నంపియు, చంపారాజు ననేకసారు లోడించియు నీతడు శతృ భయంకరుడై యుండెను. దివాకరుడను పండితాగ్రణి యీరాజునకు గురువు. ఏడవజయవర్మ కాంభోజరాజులలో కడపటివాడు. క్రీ. శ. 1182-1201 నడుమ నీతడు రాజ్యమేలెను. చంపారాజ్యము