పుట:Bharatiyanagarik018597mbp.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తేజోహీనములై సామాన్యమైనవిగనున్నవి. మతమునకు బిమ్మట పేర్కొనవలసినది వాఙ్మయము. స్థానికమగు చామ్‌భాష యీదేశమునం దుండినను సంస్కృతమే రాజభాషగ పరిగణింప బడినది. హిందూవిజ్ఞానము చాలభాగము చంపాలో వ్యాపించినది. వ్యాకరణము, జ్యౌతిషము, ధర్మశాస్త్రము, మీమాంస, శైవోత్తరకల్పము, అఖ్యానము, రామాయణము, మహాభారతము మున్నగునవి. యీదేశీయులకు చక్కగ దెలిసియుండినవి. మతమును, వైదుష్యమునేగాక చంపారాజులు హిందూదేశమునుండి సాంఘికపద్దతులనుగూడ తమ దేశమునకు గొనితెచ్చిరి. ఇచటగూడ బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రాది చతుర్వర్ణములు నుండినవి. రాజు లందరును క్షత్రియులుగ నుండిరి. అయినను వారు బ్రాహ్మణులతో మాత్రము వైవాహిక సంబంధములను గలిగియుండిరి. రాజపుత్రులు బ్రాహ్మణకన్యలను, బ్రాహ్మణయువకులు రాజ కన్యకలను బరిణయమాడు టాచారమైయుండినది. అందుచే గొందరు చంపారాజులు తాము బ్రహ్మ క్షత్రియకులజులమని చెప్పుకొను చుండిరి. వివాహము హిందూపద్దతినే జరుగుచుండెడిది. చంపాలో హిందూదేశము నందువలెనే రాజు రాష్ట్రమునం దగ్రగణ్యుడుగ నుండెను. సాధారణముగ నధికారము తండ్రివెనుక జ్యేష్ఠపుత్రునికే చెందుచుండెను. కొన్నిసమయములలో సామంతులును, మంత్రులును జేరి రాజు నెన్నుకొనుచుండిరి. ఒక్కొక్కప్పుడు రాజులు దత్తతచేసి కొనుటయు జరగెడివి. రాజ్యాభిషేకము హిందూధర్మశాస్త్రముల ననుసరించియే జరుపబడుచుండెడిది. అ సమయమున రాజులు క్రొత్తనామములను, బిరుదములను గైకొనుచుండిరి. జ్యేష్ఠపుత్రుడు యౌవరాజ్యాభిషిక్తుడై మహాసేనాపతిగ నుండెను. చంపారాజ్యము మూడువిభాగములుగ నుండెను. అందు మొదటిది అమరావతీ విషయము ఉత్తరముననున్న యీవిషయము నేటి అంగ్‌నాం (Quang-nam)కు సరియగును. విజయ యను రెండవవిషయము రాజ్యము మధ్యనుండెడిది. ఇయ్యదినేటి