Jump to content

పుట:Bhagira Loya.djvu/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బొమ్మలరాణి

ఖర్చులక్రింద, బహుమతీ క్రింద, ఇచ్చింది 300 అనిన్నీ, పేపర్లు అచ్చువేయించడం, ఊరంతా పంచిపెట్టించడం వాట్లకీ అయిన ఖర్చు నూరురూపాయలు అనిన్నీ, 50 రూపాయిలు హాలు అద్దె అనిన్నీ లెక్క చెప్పాడు.

కామేశ్వర్రావు పూరిగుడిశెలలో ఉండకూడదని, ఛండాలపు నీచపదార్థాలు తినకూడదనిన్నీ వీరయ్యతో హోరాహోరీని దెబ్బలాడి, ఆ గుడిశెలు, గాడిదలు, వాళ్ల బట్టలు అన్నీ, ఇతర బీదవాళ్ళకు దానా లిప్పించాడు. వీళ్ళందరినీ తీసుకొచ్చి సత్రములో పెట్టాడు. శుభ్రమైన వస్త్రాలు కట్టబెట్టించాడు. మీనాక్షి హృదయం సంతోషంతో సంగీతాలు పాడుకొనేటట్లు వీరయ్య జట్టువాళ్ళందరికీ నాగరికతా దీక్ష నిచ్చాడు.

మీనాక్షి సంగీత సభలు నెల్లూరు, గుంటూరు, బెజవాడ, ఏలూరు, రాజమండ్రి మొదలైన పెద్దపురాలలో పెట్టించి, విశాఖపట్టణంలో సభ జరుగుతుందని ప్రకటించాడు. సీతారామయ్యగారినీ, అళహసింగరి శిష్యుడైన ఒక తెలుగు మార్దంగికుణ్ణీ తీసుకొని, కామేశ్వర్రావు ఈ సభలు చేయించాడు. భారతీయసంగీత మహాకాశంలో ఒక ఉత్కృష్టనక్షత్రం బయల్దేరిందనిన్నీ, మీరాబాయి మళ్ళీ అవతారం తాల్చిందనిన్నీ పత్రికలన్నీ ప్రశంసించాయి. మీనాక్షికి మెడల్సూ, హారాలూ, వెండివస్తువులూ మొదలైన బహుమానాలు వానలాగు కురిశాయి.

83