పుట:Bhagira Loya.djvu/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బొమ్మలరాణి

తనని వదిలేసి ఉంటారు. కులదైవము రాములవారు అసలున్నాడా ?

ఆ రా త్రల్లా నిద్రపోకుండా ఏడుస్తూనే ఉన్నది మీనాక్షి.

వీరయ్య తన మనవరాలు మళ్లీ తిరిగి తన జట్టులోనికి వచ్చినదనిన్నీ, పేరుపొందిన సంగీతపాటకుడగు సీతారామయ్యగారి దగ్గిర సంగీతవిద్య నేర్చుకొని గొప్పపాటకురాలైనదనిన్నీ బెజవాడ నగరాలపేటలో చాటింపించాడు. ఆ రాత్రి ఆకెళ్ళవారి సత్రందగ్గిర తోలుబొమ్మలు చూడడానికి వచ్చిన జనం బెజవాడ పుష్కరానికన్నా రారు. ఉత్తరగోగ్రహణం కథ ప్రారంభించారు. మీనాక్షిది సైరంధ్రి పాత్ర. బొమ్మలాట పాకలో ఒక మూల నలిగి పోయిన పువ్వులదండలా, చంద్రుడు లేకుండా కారుమబ్బులు పట్టి, తుంపర్ల పడుతూన్న రాత్రిలా కూచుని ఉంది. రెడ్డియ్య విఘ్నేశ్వర, సరస్వతీ ప్రార్థన లవగానే "ఆలాగున ధర్మరాజులవారున్నూ, భీమసేనులవారున్నూ, అర్జునమహారాజున్నూ, నకుల సహాదేవులైన కవలలున్నూ, ద్రౌపదీదేవి మహారాణియూ, ధౌమ్యులవారితో కూడానున్నూ" అని అన్నాడు.

"ఆహాఁ!"

"పన్నిండేళ్లున్నూ అటవీ, అరణ్యం,విపినం, గహనం, కాననం, వనం ఇత్యమరః, అయినటువంటి అరణ్యంలో వాసం చేసినవారు అవుకుంటూ -"

75