పుట:Bhagira Loya.djvu/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'బాపిరాజు'

ఈ రెండేళ్ళూ సీతారామయ్యగారు తండ్రిఅయ్యాడు: ఆయనభార్య తల్లిఅయినది: ఆయన కుమార్తె అక్క అయినది; కామేశ్వర్రావు ప్రాణస్నేహితుడైనాడు. కంపులతో, పెంటపోగులతో నిండి వున్న ఆ యేలూరి కాలవగట్టు నరక కూపమై తోచింది. కామేశ్వర్రావుగారు తనకు పదేపదే చెప్పిన ప్రకృతి విలాసా లేమీ ప్రత్యక్షం కాలేదు సరికదా, ఆకాశాన్ని నక్షత్రాలు గాడిద లద్దెలలా కనపడ్డాయా బాలకు. బెజవాడ చుట్టూ ఉన్న కొండలు పాడైపోయిన పూరిగుడిసెల్లా ఉన్నాయి.

ఎందుకు తన కీ సంగీతంనేర్పించారు? బాగా బతకడం యొక్క అందం ఎందుకు తనకు నేర్పుట? అడవి కఱ్ఱకు శిల్ప సౌందర్యం యిచ్చింది మళ్ళీ ముళ్లడొంకల్లో పడవేయడానికా? ఆమెకు జలజల కన్నీళ్లు ప్రవాహాలు కట్టినవి. తండ్రీ, తాత, తల్లీ వాళ్లు యమకింకరుల్లా కనపడ్డారు. కామేశ్వర్రావుగారి పాదాలు కొలుస్తూ, దాసీలా ఇంత సేవ చేస్తూంటే బాగుండునే! గురువుగారికి, గురువుగారి భార్యకు వాళ్ళింటో పనిచేసే మనిషిలా తాను చాకిరీ చేస్తూ ఉండి పోతే బాగుండునే! గురువుగారూ, కామేశ్వర్రావుగారూ ఎందుకు తనను తాతగారు తీసుకొస్తూంటే ఊరుకొన్నారో. కామేశ్వర్రావు నాయుడుగారు తియ్యటి కబుర్లు చెపుతూంటే తాను నిజమనుకొంది. మలాం చేసి జీను వేసి, మంచి దుస్తులు వేసినా గాడిద గుఱ్ఱం ఏలా అవుతుందని వాళ్లిద్దరూ

74