పుట:Bhagira Loya.djvu/40

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
నాగేటిచాలు
 

యెప్పుడూ యెవరో బాధిస్తూనే వున్నారు. ఆతడు తన బ్రతుకును రాజరికం చేసుకున్న రోజులు కాకతీయులతోనే వెళ్ళిపోయాయి. తురక ప్రభువులకు వంగి సలాము చేసినా ఆ నాటి యాదగిరిరెడ్డి ముక్కు పుటాలు విస్ఫారితం కావడం మానలేదు. ఆతని నడుం గూను కాలేదు. ఆ నాడు ఆతడు పండించిన పంటంతా, దొడ్లో కాసిన కాయగూర లన్నీ, ఆతని మేకలు, కోళ్లు, ఆతని ఆవులు, బర్రెలు వాటి పాలు దేశముఖుల, వతందారుల, కౌలుదార్ల, పటేలు పట్వారీ, పోలీసు ముంతజీముల వంట శాలలల్లోకిపోయినా ఆతడు మట్టి తినే జీవించాడో, ఆకు అలమూ ఆస్వాదించి బ్రతికాడో? శాతవాహనుల నాడు, చాళుక్యుల కాలంలో, కాకతీయుల దినాలల్లో తెలుగునాడు పొలాలల్లో ఏరికూర్చుకున్న శరీర బలమూ, మనోబలమూ కరిగి కరిగీ, తరిగి తరిగి, మరిగి మరిగి నాశనమైనా మధ్యన వున్న చావైనా, చెక్కుచెదరకుండా నిల్చి వుండడం చేత తనవంటి యాదగిరిరెడ్లు, తన భార్య వంటి బతుకమ్మలు యీ నాటి విమిక్తిలో సగర్వంగా నిలబడ గల్గారు.

తన దేశంలో వెట్టిచాకిరీ పోతుంది. తన భూమి తనది. జమీందార్లు, జాగీర్దార్లు హరించి పడమటిగాలిలో మాయమై పోతారు.

ఈ అందాల ప్రోగైన తన భార్య గర్భంలో స్వచ్ఛ స్వేచ్ఛావాతావరణంలో దివ్యగాంధర్వం ఆలాపించ గల్గే తన పుత్రుడు యింకో యాదగిరిరెడ్డి కదులుతూ వున్నాడు.

39