Jump to content

పుట:Bhagira Loya.djvu/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'బాపిరాజు'

వానచే తడసిన ఆ బంగారుభూమి నాగేటిచాలుకు ఆనందంతో దారి యిస్తూ, గంధం అలదికొన్నట్లు సువాసన వెదజల్లుతోంది. యాదగిరిరెడ్డి యీ రోజు తెల్లటి ఆ దుక్కి గిత్తలను తోలుతూ నాగేటిచాలు సాగిస్తాడు. ఆతని నాగేటిచాలుకి దేశముఖులు అడ్డం కారు. ఆతడు వతందార్లకు వెరవడు. కవులు దార్లను చిన్నచిన్న గులక రాళ్ళలా పార వేస్తాడు. ఆ జమీ అంతా అతడే దున్నుతాడు. అతడు ఆకాశరైతుకూ భూమి రైతాంగనకూ పుట్టిన ఆంధ్ర వీరుడు.

5

ఉదయం మొదలుపెట్టిన దుక్కి ఆ సాయంత్రం వరకు సాగుతూనే వుంది. ఆ భూమంతా భూమిదేవి పులకలు లా, తందానతాన పాటలు లా ఆకాశంలో చుక్కల నడకల లా నాగేటిచాలు లతో నిండిపోయింది. మధ్యాహ్నం చెల్లెలు గంపలో పట్టుకువచ్చిన జొన్నరొట్టె, పులుసూ, కూరా మెక్కినాడు యాదగిరిరెడ్డి. ఈ రాజ్యం తనదై ఈ భోజనం గోధుమరొట్టెఅయి, ఘనపురం బియ్యం అన్నమై, రేపు ఉదయించదా అనుకున్నాడు యాదగిరిరెడ్డి. నాగలి విప్పి బుజాన వేసుకొని ఎద్దుల తోలుకుంటూ పాట పాడుకుంటూ దగ్గరవున్న తన గ్రామానికి దారితీశాడు ఆ యువకుడు.

36