నాగేటిచాలు
రాజనాలో, సన్నారులో, ముతక అక్కుళ్లో, కృష్ణకాటుకాలో పాలాట్రగడాలో, తెల్లజొన్నలో, పసిడిపచ్చ జొన్నలో, కందులు - సెనగలు - పెసలు - మినుములో నువ్వులో కుసుమలో.....
యాదగిరిరెడ్డి నాగలి అటు నందిపర్వతంనుంచి ఇటు తెలవాహా నది వరకు సాగుతూనే వుంది. భూమి దున్నేవాడు, పంటపండించేవాడు, పాటపాడేవాడు. బండ్లపై ధాన్యాలు యింటికి తెచ్చేవాడు. దేశంపై దోచుకునేందుకు వచ్చిన పాడుమూకల్ని కత్తికట్టి చీల్చి చండాడి నాశనం చేసేవాడు. రాజ్యాలు నిర్మించాడు. రాజ్యాలు యేలాడు. పాడురాజుల్ని నాశనం చేశాడు. మంచిరాజుల్ని తక్తుపై యెక్కించి కూర్చో పెట్టాడు. ఆ నాడు రాజై కవులను సత్కరించాడు. దేవాలయాలు నిర్మాణం చేయించాడు. శిల్పాలు, చిత్రలేఖనాలు దేశం అంతా సౌభాగ్యం నింపాడు. పాటలు పాడాడు. పాడించాడు. బంగారాలు తెచ్చాడు. సువర్ణాలు వెదజల్లాడు.
ఈ నాడు యాదగిరిరెడ్డి తానే రాజ్యభారం వహించడానికి సంకల్పించాడు. అతి తెలివైన వాళ్ళ కృతిమాలు ఆతనికి అడ్డా! దేశభక్తులమంటూ దేశద్రోహం చేసే పాడు జీవితా లతనికి ఆనకట్టలా ! యాదగిరిరెడ్డి నాగలి గిత్తలను అదిలిస్తూ "సాగండె, గొప్పు లడ్డమా, రాళ్లు అడ్డమా, లోపల విషంపెట్టుకున్న మనసులు అడ్డమా - మనకి, సాగండె" అనేవాడు.
35