పుట:Bhagira Loya.djvu/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'బాపిరాజు'

పండినపంటలోని పచ్చదనములోని పరిమళము. ఆమె అందము వెన్నెలప్రసరింపు జిడ్డు గల తీపి అయ్యో! ఆ అందం నా దేహంలో, నా హృదయంలో, నా ఆత్మలో లీనం చేసికొనక నా జన్మ వృధా.

ఆమె గుహలో ఒంటిగా చిత్రించుకునే కాలంలో ఆమెను, కల్హారమాలాదేవిని కలుసుకోడానికి వెళ్ళాను. భగవానుడా! అతికోమలమైన ఆమె జీవితాన్ని పరీక్ష చేయడానికి వెళ్ళే నేను అందమయిన రెక్కలతో పూలలో ఎగిరే సీతాకోకచిలుకను పొంచుండి కబళింపబోయే ఊసరవెల్లిలా వున్నాను. చిత్రించుకొంటూవున్న ఆ బాలిక ప్రజ్ఞా పరిమితలా వున్నది.

“ఏమిటి, ను వ్వీరోజు చిత్రించుకుంటున్నది?”

“ఉన్న ఒక్క వస్త్రమూ బుద్ధదేవునికి అర్పిస్తున్న ఆ పవిత్ర చరిత్ర చిత్రము రచిస్తున్నాను.”

“ఏమిటీ! నన్ను చూడనీ. ఓహో! ఎంత అద్భుత సృష్టి! బాలికా! నీ కింక శుశ్రూష అవసరము లేదు. నీ విద్య పూర్తిఅయినది.”

ఈటె దెబ్బ తిన్న గువ్వలా ఆమె వణికిపోయింది. “ప్రభూ! నన్ను మీరు ప్రేమించడంలేదా? నాకై నియమాలన్నీ వదులుకొని నన్ను ఆమ్రపల్లి కన్న ధన్యురాల్ని చేసి ఒక్కసారిగా నన్ను అవసరములేని పుష్పంలా విసరి పారవేస్తారా?”

“నీకు ప్రేమను గురించి ఏమి తెలుసును?”

28