పుట:Bhagira Loya.djvu/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దీపం సెమ్మా

4

నాకు నాలుగైదు సంబంధాలు, ఆంధ్రదేశం లోకి గొప్పవి వచ్చాయి. ఒక సంబంధం మా నాన్నగారికి ప్రాణ స్నేహితుని కుమార్తె. ఆ అమ్మాయి చాలా అందంగా వుంటుందని అందరూ అంటారు. ఆమె బొమ్మచూసిన నేనూ అల్లాగే అనుకున్నా. ఆ అమ్మాయిని చూడ్డానికి నేనూ మా నాన్నగారు వెళ్ళాం గుంటూరు.

అప్పుడు విజయదశమి. గుంటూర్లో అందరూ కలశాలు పెట్టి నవరాత్రములు జరుపుతారు.

మా నాన్నగార్ని నన్నూ ఆ యింట్లో చేసిన గౌరవం యింతా అంతా కాదు. అప్పుడే పండగలకు రాబోయే అల్లుడు వచ్చాడా అన్నారట లోకులు.

వాళ్ళింట్లో పండగబొమ్మలు పెట్టారు. ఒక గది యిచ్చారు వాళ్ల అమ్మాయికి. ఒక్కతే కూతురు. ఆ అమ్మాయి తమ్ముడు నా దగ్గిరకు వచ్చి అస్తమానం ఎగాదిగా చూడ్డం. అతని కళ్లు విశాలంగా బాగానే వున్నై; ఆతని అప్పగారి కళ్లు."

దశమిరోజున బొమ్మల గదిలో ఆ అమ్మాయిని చూడ్డానికి ఏర్పాటయింది. లోపలికి వెళ్ళా. మిల మిలలాడుతూ బంగారు బొమ్మలా నుంచుంది. సిగ్గు నవ్వు మోముతో ఆ అమ్మాయి. నాకు సిగ్గు వేసింది. నా గుండె కొట్టుకుంది. ఆ అమ్మాయి అందం వర్ణించడానికే వీలులేదు.

125