పుట:Bhagira Loya.djvu/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జగ్గన్నగంటం

మంత్రి ప్రతిభకు, పాండిత్యానికి, సేనల్ని నడిపే బంటుతనంలో ఆతని ప్రజ్ఞకు యెంతో మెచ్చుకొని, నీలాంబుజలోచనీదేవి లా వెలుగు తన పుత్రికను పత్నిగా స్వీకరించ వలసినదని నాగమనీని ప్రభువుద్వారా సందేశము పంపెను.

నాగమనీడు ప్రభువు రఘునాథ భూపాలుడు తనపై చూపిన ఆదరాభిమానాలకెంతో సంతోషించి 'సమరవ్యూహ నిర్వచన', 'పరగండ భైరవ' అను బిరుదాలను భక్తితో స్వీకరించి జగ్గన మంత్రికి తన ఆస్థానంలో మంత్రిత్వ పదవిని మహారాజు సమక్షంలోనే అర్పించినాడు. కడలి పురాన్నుండి రామన్నమంత్రి సకుటుంబముగ తంజావూరు వేంచేసినాడు.

జగ్గన్నమంత్రి వివాహం అతి వైభవంగా జరిగింది. ప్రభువుతో, బంధువులతో, భార్యతో, భార్య బంధువులతో జగ్గన్నమంత్రి దేవరకోట వచ్చి చేరినాడు. దేవరకోటలోను కడలిపురంలోను అనేక మహోత్సవాలు జరిగినవి.

వ్యవసాయం చేసుకుంటూ, కృష్ణవేణీ తీర ప్రదేశాల ఆనందంతో విహరిస్తూ, రాజకార్యాలు నిర్వర్తిస్తూ జగ్గనమంత్రి తన గంటాన్ని మళ్ళీ చేతపట్టినాడు. 'సత్యభామా విజయ'మను సంస్కృత కావ్యాన్ని, 'నాగమనీడు ప్రభు విజయ'మను తెలుగు కావ్యాన్ని ప్రారంభించి జగ్గన రెండు నెలలలో పూర్తిచేసి ప్రభువున కంకిత మిచ్చినాడు. అంకిత మహోత్సవము కోటలో అఖండంగా జరిగింది. రఘునాథ సరస్వతీమందిరము దర్శించిన నాగమనీడు ప్రభువు పెన్నిధియైన జగ్గనమంత్రి తనకు బాసటగ నుండగా ఏమి కొదువ

115