పుట:Bhagira Loya.djvu/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'బాపిరాజు'

ఏమాత్రం అనుకోకుండా, కొలదోపిడిలో రత్నాలరాసులు కలలుగంటూ ఏమరుపాటున నున్న ఆ బందిపోటు దండుపై హిమపాతంలా, రామబాణంలా, ఏనుగుల దండులా విరుచుకు పడ్డారు. బుడతగీచుల తుపాకులు ముక్కలయ్యాయి. అరబ్బుల సురియలు తునకలయ్యాయి. యేబదిమంది తోడి దొంగలు తమ ప్రాణాలు ఆంధ్రభూమి కర్పింపగా, తక్కినవారు పలాయన మంత్రము పఠించగా, రామన్నమంత్రి వెంటాడి, ఒక్క పురుగైనా లేకుండా బందిపోటు లందర్నీ మట్టిపాలు గావించాడు.

ఈ విషయం తలంపుకు రాగా నాగమనీడు ప్రభువు రామన్న మంత్రికి ఆహ్వానమూ, అందలమూ పంపించాడు. దేవరకోట కోటలోకివెళ్ళిన రామన్నమంత్రిని, రాయసం అడివి మాచన్నగారు సగౌరవంగా, సింహాసనాసీనుడై కొలువు తీర్చియున్న శ్రీమంతు నాగమనీడు ప్రభువులంవారి సభలో సమక్షాన ప్రవేశింప జేసెను. నాగమనీడు ప్రభువు లేచినాడు. సభికు లందరూ లేచినారు. నాగమనీడు రామన్న మంత్రికి నమస్కరించి ఆసనము చూపించి రామన్నమంత్రి ఆసీనుడు కాగానే, తాను సింహాసన మధివసించి "ఏమండీ! అయ్యవారూ ! తమ యింటిలో అందరూ క్షేమంగా వున్నారని తలుస్తాను" అని ప్రశ్నించినారు.

రామన్నమంత్రి -- శ్రీ నాగేశ్వరస్వామి కరుణవల్ల ప్రభువులవారి కటాక్షంవల్ల అందరూ క్షేమంగా ఉన్నామండి.

108