పుట:Bhaarata arthashaastramu (1958).pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మారంభించును. బలాత్కారముగ విడువక నోట నీటింబోసిన నాహింస చెప్పనలవిగాదు.

ఈ విషయమునే బోధించు నొక కథగలదు. వేసవికాలమున నొక బాటసారి యొక యెడారిలో బ్రయాణము జేయుచుండెను. పాప మెండవేడిమిచే నెంతయుదపించి దాహాతురుడై యాపాంథుడు చుట్టుప్రక్కల నీ రెచ్చోటను గానక "యెచటనైన నింత త్రావనీరు చిక్కునా దేవుడా?" యని చింతించుచు బ్రయాణము సేయుచుండ గొంతకాలమున కతనివంటి మార్గస్థుడొక డెదురయ్యె. వానింజూచి యితడు నోరెండిపోవ "అయ్యా! ఇట్లే వచ్చితివికదా! త్రోవలో నెక్కడైన నీరున్నదా?" అని యడిగెను. అందున కతడు "సుమారిచటికి బరువుదూరమున నొక బావియున్నది. అందు మొదటి భాగముననుండు నీరు ద్రావిన నమృతతుల్యముగ నుండును. రెండవభాగమున కొంచె ముప్పగా నుండును. మూడవచోట నింకను క్షారము. నాల్గవయెడ నీరు నోటబోయ సాధ్యముగాదు" అని చెప్పి తనత్రోవబట్టి వెడలిపోయెను. అదివిని యిత డిదేమి యింద్రజాలమా యని చింతించుచు నతి వేగమున ముందుపయనముజేయ నాపాంధుడు చెప్పినట్లే బావియొకటి కనులార గానవచ్చెను. ఆ పధికు డాబావిలో నొకయెడదిగి కరువుదీర నీరు ద్రావ నవి యట్లే యతిమధురములుగ నుండె. దాహముదీఱిన పిదప నతనిమాట పరీక్షింపనెంచి యింకొకచో ద్రావిన నవి యంతమధురములుగ నుండలేదు. మూడవదిక్కున ద్రావబోయి మునుపటికన్న మిగుల నుప్పగనుంటచే యెట్లెట్లో కష్టపడి త్రాగెను. నాల్గవచోట నీరు నోటబోసికొని నాలుకయంతయు జీలిపోవునట్లైన "నాతడు చెప్పినదే నిజము. ఇందేమియో యక్షిణి యున్న" దని తలచి త్రాగలేక యుమిసి తనత్రోవను బోయెనట! ఇందుగల యక్షిణిని మా చదువరు లిదివఱకే గ్రహించి యుందురు.