పుట:Bhaarata arthashaastramu (1958).pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాశి యీమాత్రమైన వెల యింత, ద్విగుణితమైన నింత, ఇత్యాది సాదృశ్యములు శాశ్వతములు. 2. మఱి యయ్యైకాలముల నయ్యై పణ్యచక్రములందు రాశిసమస్తముచే నిర్ణయమునకుదేబడు వెలయే ప్రతిభాగముయొక్కయు వెల. మఱి యీ కాలములోను పూర్వము చెప్పబడిన సాదృశ్యము లదృశ్యాకారముతోనున్నవి. ఈ న్యాయ ద్వితయము సిద్ధాంతము చేయుటకునై హేతుభూతములుగ ననూకూలించునవిగాన భాగభాగములుగ గణించుట యుక్తము.

మఱియు మూల్యశూన్యంబు ప్రయోజనశూన్యంబని కొందఱు భ్రమింతురు. ప్రయోజనము, విలువయు సమగ్ర సమత్వము దాల్చినచో, రత్నములు, బంగారు మొదలగునవి ప్రబల ప్రియములు గాన, నవి వాయ్వాదులకన్న నెక్కువ ప్రయోజనము కలవి యన వలసివచ్చును ! ఇది హాస్యవాదమేకాక కువాదమును. దీనిని ఖండించు విధమెట్లు ? విలువకు ప్రయోజనమునకు సంబంధమేలేదనియందమా ? ఇది ప్రకృతి విరుద్ధము. ప్రయోజన మున్నంగాని వస్తువుల నెవరు గొనరు. వీధి దుమ్మునెవరైన వెలనిచ్చి తీయుదురా ? కాబట్టి ప్రయోజనమునకు మూల్యమునకు నేదోసంబంధమున్నది. మన వ్యాఖ్యాన మేమందురో. విలువ రాశిననుసరించి యుద్భవించు నంత్య ప్రయోజనముతో సమన్వితము. అంత్యప్రయోజన మనగా నంత్యభాగ ప్రయోజనము. 'అంత్యభాగ' మని యనవలసి వచ్చినందున వస్తు భాగభాగములుగ నున్నదని వితర్కింపవలసె. ఉపయోగము నానామూర్తులం దాల్చినయది యను నిర్ధారణయొక్క సాహాయ్యము లేనిది గాలికి బంగారమునకును జరుగు నీతర్కయుద్ధములో గాలికి జయము రానేరదు. ఈ జయమెట్లు చేకూర్పబడె ననగా :- గాలికి నంత్యోపయుక్తిలేదు. ఇయ్యది బంగారమునందు ఘనము. అయినను బంగారమునకుండు సమష్ట్యుపయుక్తిని వాయుమండల సమష్ట్యుపయుక్తికిని సామ్యము దోమకు నేనుగునకునుండు వాసియట్టిది.