పుట:Bhaarata arthashaastramu (1958).pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూల్యములు నిర్మూలములగును. కావునగదా యనేకవస్తువులున్నం గాని విలువకును వినిమయమునకును నెడము దొరకదంటిమి. ఇట్లు ఇచ్చి పుచ్చుకొనుటలో ప్రత్యక్షమగు 'ఇంత - మాత్ర' మను పదములచే సూచింపబడిన భావమును వెల్లడిపఱుచుటకై వస్తువులు భాగ భాగముగానుండు రాసులం బోలినవని యూహింపవలసెగాని, నిజము చూడబోయిన గాలిమొదలగునవి యఖండములైన యేకసముదాయములే. అవి యిసుకవలె బొడిపొడిగా లేదనుట స్పష్టమే ఒకవేళ గుప్పలుగా బోయిదగిన వడ్లు రాగులు మొదలగువాని రాసులుండ లేదా యని యందురో ! ఉన్నవిగాని యొకమాఱు వానిని రాశిగా జేర్చిన పిమ్మట 'ఇది మొదటికుప్ప; ఇది రెండవకుప్ప' యని నిరూపింపనౌనా ? నిరూపించితిమిపో వానివల్ల నేమిగుణము ? రాశి ననుసరించి యన్ని పాళ్ళకుగలుగు విలువయొక్కటియే. అట్లగుట ప్రథమద్వితీయాది నిర్థారణ నిరర్థకచేష్ట. కాబట్టి పదార్థము లప్పటప్పటికి నేకసముదాయములుగాని భిన్నభిన్న భాగములుగావు. రాగులమండీలో నొకానొకనాడు 100 పుట్లు వచ్చిచేరినవనుకొనుడు. ఇవన్నియు నొకేయంగడిలో దిగవు 10 యంగళ్లున్న నొక్కొక్కటి 10 పుట్లుగొని యమ్మకమునకు నుంచునేమో. ఇట్లు 100 పుట్లును పదిపదిగా విభాగింపబడి 10 చోట్ల జేరినను, ఆ మండీలో నేర్పడినవెల యీ వెవ్వేఱుపదుల ననుసరించియుండదు. మఱి యా మొత్తపు 100 పుట్లనుండి ప్రభవిల్లిన వెలయే యన్నిభాగముల నావేశించును. చూచితిరా, యయ్యైకాలముల నయ్యైపణ్య చక్రంబుల వస్తువులు నిజము చూడబోయిన జిగిబిగి గలిగిన యేక సముదాయమే యనుట యనుభవదృష్టము.

భాగభాగములుగా నున్నవనుట వ్యాఖ్యానార్థము చేయబడిన యూహ. ఏవ్యాఖ్యానము లందురో. ఈ రెండు న్యాయములం బ్రదర్శించుటకై :- 1. రాశితోడ విలువయు సామాన్యముగ మాఱును.