పుట:Bhaarata arthashaastramu (1958).pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కానీ ! వస్తువులం భాగములున్నవనియు, ఈ భాగములు ప్రథమ ద్వితీయాదులనియు, అంత్యభాగమనునది యొకటియున్నదనియు, ఈ భాగములయొక్క యుపయుక్తతా గుణము క్రమమైన క్షయముం దాల్చినదనియు :- ఇన్నిసిద్ధాంతములను దెచ్చిన దెందునకు ? గాలిమాట నిలుపుటకేనా ! వినుండు. గాలిమాటయనునది మనమాటగాదా ? అనగా నవరత్నములకంటెను గాలిప్రధానమనుట యనుభవముగాదా ? ఈ యనుభవమును సహేతుకముం జేయుటకు. మఱియు, భాగభాగములనుండి ప్రభవించు సుఖము న్యూనతగలది యనుట ప్రత్యక్షానుభవ గోచరముగాదా ! నీటిసామ్యముచే నియ్యది సుబోదము సేయబడియెగదా ! కావున నీసిద్ధాంతము లన్నియు గాలి మాటలుగావు ! గేలిమాటలుగావు ! మఱి సత్యములు. ప్రత్యక్ష జ్ఞానమున లీనములైయుండు గూఢతత్త్వములు.

సంగీత విద్వాంసులరీతిని మనము నారోహావరోహములం జేసితిమి. తలనుండి తోకవఱకు మొదలు తడవిచూచితిమి. ఇప్పుడు తోకనుండి తలవఱకుం బరీక్షించితిమి. ఆమూలాగ్ర పరనమన్న నిట్టిదే యుండునేమో ! ముందునకేగుదము.

ఆద్యుపయుక్తి యనగా, వస్తురాశి యత్యల్పమై గిరాకి యత్యధికమైన కాలమున దానియందు మనకుండు నాదరము గాలికి నాద్యుపయుక్తి నిర్ణయించుట కష్టము. అది మిగుల గొంచెమైన మనప్రాణములే యుండవు. ఇంక నాదరమునకు నాధారమెద్ది ? కావున దానియొక్క ఘనత భావనాశక్తిచే నూహ్యంబు అంతోపయుక్తి హెచ్చుటయన గిరాకిహెచ్చుటయనుట. అనగా మనకు దానియందలి యాదరము వృద్ధిగాంచినందున దాని యంత్యభాగముయొక్కయు ప్రయోజనము విస్తారము గాంచెననుట. అంత్యప్రయోజనము విస్తరించు విధంబులు రెండు.

1. గిరాకి - (అనగా మనకు వస్తువునందలి యభిరుచి) నిలుకడగ నుండగా వస్తువుయొక్క రాశి తగ్గెనేని :-