పుట:Bhaarata arthashaastramu (1958).pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రయోజనమునకు విలువకునుండు వ్యత్యాసము తేటపడవలె నన్న నీరెండుపటములను గమనించి చూచినంజాలు. వెలలనో:- రాశింబట్టి యన్నిభాగములకును వెలయొక్కటే. ప్రయోజనములనో:- ప్రతిభాగమునకు నొక్కొక్క పరిమాణము. ఆదినెక్కువ; తుదిదక్కువ.

అయిన నంత్యభాగమూల్యమే ప్రతిభాగముయొక్కయు మూల్యమైన విధంబున నంత్యోపయుక్తినిం బ్రతిభాగోపయుక్తిగ నేల గణింపరాదు ? రాశితోడ మూల్యము తగ్గునుగదా ! అట్లే ప్రయోజనమును తగ్గునదియ. ఈ మాత్రము సమన్వయము గలవానికి సంపూర్ణ సమన్వయ మేలపొందింపనీరు ? ఇది యనేకులనుబట్టి బాధించు బ్రహ్మరాక్షసివంటి ప్రశ్న.

కారణములు:- 1. మూల్యము వస్తువులను గొనుట యమ్ముట వీనిలోదేలు తారతమ్యము. 500 పుట్లుండిన కాలములో వెలలు 4 కి వచ్చెబో. 100 పుట్లేయుండిన వెల 6 రూపాయలుగ నుండు ననుట యిపుడును (అనగా 500 పుట్ల కాలమునను) నిజమేయైనను 100 పుట్లను 6 రూపాయలుగను, తక్కిన 400 ను 4 రూపాయల రీతిగనమ్మ నెవడు గాంక్షింపడు ? కాంక్షించినను నాకాంక్ష విఫలమే. ఎట్లన:- అట్టి పిచ్చివాదముల కెవడైన గడంగిన 'మాకు 4 నకువచ్చు 400 లోనుండు పుట్లనేయమ్ముడు. వెలపొడుగైన 100 టిని మీయింటనే నిలుపుకొనుడు' అని తీయువారు హేళనము సేతురు. కాబట్టి భాగములు భిన్నప్రయోజనములుగ నున్ననేమి ? తక్కువ ప్రయోజనముగలిగి, వెల సరసమగు నంత్యభాగము గొన్ననేమి ? ఎక్కువ ప్రయోజనము గలదియని వ్యాఖ్యానార్థమెన్నబడిన ప్రథమభాగము గొన్ననేమి ? భాగములగుణము సమానమైన సుఖము సమానమే. కావున గొనువాడు రాశింబట్టి యేర్పడిన యధమపక్ష క్రయమునకన్న నధికమేనాడు నియ్యడు. సుఖమెక్కువగనున్నను, అట్టిభాగమే తక్కువవెలకు లభించునేని ఎక్కువవెలయేలయిచ్చును ?