పుట:Bhaarata arthashaastramu (1958).pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అట్లైనచో ప్రతిభాగమునకును వెవ్వేఱుమూల్యము లున్నవని యేలయంటిరి ? అయ్యో రామా ! మేమట్లనలేదు. మామాటయొకటి. మీయర్థము వేఱొకటి ! కానిండు ! ఈ సంశయమున నివారింప నొంకొకవ్యాఖ్యానము చేసెదము.

ఈ క్రింది దృష్టాంతమును విమర్శింపుడు:-

100 పుట్ల కాలములో వెల పుట్టికి 6 రూపాయలు
200 పుట్ల కాలములో వెల పుట్టికి 5 1/2 రూపాయలు
300 పుట్ల కాలములో వెల పుట్టికి 5 రూపాయలు
400 పుట్ల కాలములో వెల పుట్టికి 4 1/2 రూపాయలు
500 పుట్ల కాలములో వెల పుట్టికి 4 రూపాయలు

ఇట్లు వెలలు మాఱుట స్వాభావికమేకదా ! కాబట్టి మూల్య సిద్ధాంత మూహించు పద్ధతి యెట్టిదనగా:-

300 పుట్ల కాలములోను 100 పుట్లేయున్న దానికి వెల 6 రూపాయలవంతున యుండుననుట నిశ్చయము. కావున 300 పుట్లుత్పత్తియైన యవసరమందును 100, 200 టికిని, 6, 5 1/2 లకును క్రమముగాగల సామ్యములు నశించినవిగావు. అవి బయట బ్రత్యక్షముగ నిల్వకున్నను ఈ యధిక రాశి కాలమందును లీనమైయున్న న్యాయములు. కావున వానిని వదలగూడదు. మఱి 300 పుట్ల కాలములో ప్రతియొక్క పుట్టికిని సాక్షాత్తుగ సిద్దించుధర 5. దీనిని వదలరాదు. ఇక నీరెంటిని గలిపినట్లు చూపుట యెట్లనగా:-