పుట:Bhaarata arthashaastramu (1958).pdf/54

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఇతర వస్తువులచేగాక రాజస్ర్థాపిత రూప్యములతో గొలిచిన వెలలు సిద్ధించును. కావున విలువ నిశ్చయింపవలయునన్నను, వెల నిశ్చయింపవలయునన్నను, ఈ క్రియ తారతమ్య నిరూపణము నాశ్రయించి యుండునదగాన, ననేకవస్తువులుండినంగాని సాధ్యంబుగాదు.

ప్రయోజన తత్త్వనిర్ణయమున కేకవస్తువైనం జాలును. ఎట్లన, దానియుద్దేశము మనుష్యస్వభావములకు (అనగా వాంఛలకు) దద్భావసంతుష్టి కరములగు పదార్థములకునుండు బాంధవ్యము ప్రకటించుట కాబట్టి లోకమున ననితరమైన వస్తువొకటిమాత్రమున్నను, దానిచే మనకుగలుగుతృప్తి 'వాంఛ లనంతములుగావు' అను న్యాయమును వివరించునప్పుడు ఉదాహృతమైనరీతి ననుసరించుననుటను వ్యక్తపఱుచుట సులభము. వస్తువుయొక్క రాశి యల్పమైన దాని యందలి యాదరణ మధికముగ నుండుననియు, ననుభవింప ననుభవింప నూతనముగ వినియోగమునకు వచ్చుభాగములవలని సుఖము హ్రస్వమగుచు వచ్చుననియు, నిత్యాది ప్రయోజనస్థితింగూర్చిన న్యాయములన్నియు నాయేకవస్తువునే యాధారముగగొని నిరూపింపవచ్చును. ప్రయోజనమునకును, మూల్యమునకును నిదియొకభేదము, అద్వితీయములకు నుపయుక్తత యుండబోలుగాని విలువ యసంభవము.

మూల్యము - ప్రయోజనము - రాశి వీనియందలి యన్యోన్య క్రమములు

సార్థవస్తువులలో ప్రయోజనము, మూల్యము ననుగుణద్వయ మున్నదంటిమి. ఈ గుణములకుంగల పరస్పరతయొక్క వివరమెట్లు ?

సామాన్యముగా జూడ బోయిన :-

1. ప్రయోజన మెక్కువయైన మూల్యము నాధిక్యముం బొరయును. ఉదా. బంగారునందు జనులకు ననురాగము మిక్కుటము. ఇనుమునం దంతగాఢముగాదు. కావున నినుమునకన్న బంగారము విలువయందు మిన్న. కొనుటలో నెక్కువమొత్తము నిత్తుము. అమ్ముటలో నెక్కువ పుచ్చుకొందుము.