పుట:Bhaarata arthashaastramu (1958).pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మఱియు నిష్టార్థముల నీడేర్చుటకు నిజంబుగ శక్తిమంతములు గాకపోయినను శక్తియుక్తములని నమ్మితిమేని జాలును. అయ్యవియు నర్థంబులుగ నెన్నబడును. అనారోగ్యముచే బీడితుడగు నరుండు దేహముతోడ బుద్ధిబలంబుం గోలుపోయినవాడై యౌషధముల వలనం గానిపని సిద్ధి మణిమంత్రంబుల చేనగునని తలంచి భూతవైద్యులకు వారడిగినంత కానుక లొసగునుగదా ! కావున నట్టి బూతులను జీవనోపాయము లౌటజేసియు మూల్యయుక్తంబులు. గావునను అర్థంబు లనబడవలయు.

సరూపములగు వస్తువులేకాదు. క్రియలుసైత మర్థింపబడినచో నర్థములగును. తలిదండ్రులు తమకుమారుని యభివృద్ధిగోరి శిక్షా నిపుణుండగు విద్యావంతున కెంతైనధనంబొసగి ఉపాధ్యాయుడుగ నుండ వేడికొందురుగాదె ? గురుండైనవాడు పదార్థములనమ్ము వ్యాపారివలె నిజపాండిత్యము నితరులకిచ్చి తాను అదిలేనివాడు కాకపోయినను, దానంబుట్టు ప్రతిభావిశేషమున కితరులను బాత్రులుగ జేయును. వ్యాపారి పదార్థముల నమ్మెనేని తనకవి లేకపోవుట తటస్థించును. విద్య, ఆరోగ్యము, దేహబలము, వీని నారీతిని విక్రయించుట సాధ్యముగాదు. అయినను తత్సంభవములగు ఫలముల నితరులనుభవించునట్లు చేయవచ్చును బలవంతుడైనవాడు దుర్బలుడగు సాహుకారియొద్ద గేహరక్షకుడుగానుండి వాని దౌర్బల్యము వలన గలుగు బాధలను నిరాకరింపగలడుగాని తనబలము వానికిచ్చి వానిని పరాక్రమవంతునిగా జేయనేరడు. క్రియాజన్య ఫలంబులను పరివర్తింపనగునుగాన క్రియలు నర్థంబులనియే భావింపవలయును.

ప్రయోజనత్త్వంబు అర్థత్వంబునకు బ్రధాన కారణంబనుటయు, విత్తోపార్జనంబున కనుకూలములగు క్రియలును అర్థంబులనబడు ననుటయు విలువగలిగినవన్నియు నర్థంబు లనుటయు నీప్రకరణములోని ముఖ్యాంశములు అర్థత్వమునకు మూల్యవత్త్వము ప్రధాన లక్షణము. కావున నర్థము, మూల్యము, ప్రయోజనము వీనికుండు సాంగత్యము నెఱుంగుట ఈ శాస్త్రమున విఘ్నేశ్వర ప్రార్థనవంటిది.