పుట:Bhaarata arthashaastramu (1958).pdf/52

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నాల్గవ ప్రకరణము

మూల్యలక్షణము

సార్థవస్తువులలోని గుణములు రెండు. 1. నేరుగగొదవలందీర్చి తృప్తి యొనర్చుట. దీనికే ప్రయోజనము, ఉపయోగము ఇత్యాదులు నామములు. 2. మఱి ఇతరులయొద్దనుండు వస్తువులగొనుట కనుకూలించుట. దీనికే మూల్యము అని పేరు. అమూల్యములైన పదార్థంబు లనగా విలువకు మీఱినవని యర్థము. అనగా వానిని నిలుచుటకు దగిన యితర పదార్థములు లేవనుట. మూల్యమునకు బర్యాయపదంబు విలువ.

విలువకును వెలకునుగల సామ్యము

విలువకును వెలకును భేదంబు గలదు. ప్రతిదేశములోను సర్కారువారి యధికారముచే నప్పులుదీర్చుట మొదలగు నొడంబడికల నెరవేర్చుటకై యుపకరణములుగ నిర్ణయింపబడిన నాణెములున్నవిగదా ! అట్టి నాణెములచే బదార్థములలోనుండు మూల్య పరిమాణమును నిర్ణయించుట వెలయనబడును. దీనికే ధర, క్రయము, ఖరీదు మొదలగు నామాంతరములు. మూల్యమును వెలయును భిన్నములనుటకు నిదర్శన మేమన్నను :- ఒక కాపువాడు తన యావును సంతకుంగొనిపోయి యమ్మి యెద్దును గొనిరావలయునని సంకల్పించికొన్నవాడను కొందము. ఈ కార్యము రెండువిధముల నెరవేర్చికొననగును. ఆవును విక్రయించి రూపాయలగొని యారూపాయిల నెద్దును గొనుటలో నుపయోగించుట యొకటి, అట్లుగాక యెద్దునకు మాఱావును గొనదలచిన వాడెవడైన జిక్కెనేని రూప్యంబుల సహాయ్యములేకయ వీరు దమ తమ వస్తువుల మార్చుకొని సిద్ధార్ధులై గృహమునకు బోవచ్చును. కావున ద్రవ్యమూలముగగాక నేరుగ వస్తువుల మార్చుకొనుట రెండవది.