పుట:Bhaarata arthashaastramu (1958).pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తచ్ఛాంతికి సాధనములగు వస్తువుల నర్థములని భావించుట యీ శాస్త్రమున నావశ్యకము. ఇందులకు గారణములు :- అర్థములు చెడ్డవైననుసరే మంచివైననుసరే సామాన్యలక్షణములు కలవిగానున్నవి. చూడుడు. సారాత్రావగోరువాడును ఇల్లుకట్టి పత్నీ పుత్రులను బోషింపజూచు నరునిబోలె పాటుపడవలసినవాడే. అనగా 'అర్థార్జనంబునకు శ్రమ ఆధారభూతంబు' అనుట సామాన్య న్యాయంబు. ఇట్టి సామాన్యన్యాయంబులు పెక్కులు గలవు. వీనిని విమర్శించుటయే యర్థశాస్త్రముయొక్క ముఖ్యోద్దేశము.

మఱి నీతిశాస్త్రమట్లు ఇది యుపదేశ శాస్త్రంబుగాదు. ఏకారణములకే కార్యములు ఫలంబులు, ఏకార్యములకే కారణములు మూలంబులు, ఏహేతువులంబట్టి యేసిద్ధాంతములను నిర్ణయింపనగును, ననువిషయములను విచారింతుమెకాని 'ఇట్టికార్యము చేయవలయును, ఇట్టికార్యము చేయరాదు' అని యుపదేశించు ప్రతిజ్ఞ మనదిగాదు. శాస్త్రంబును ఉపదేశ నిర్దేశములని రెండువిధములు. నిర్దేశశాస్త్ర మనగా వస్తువుల లక్షణములను తత్సంబంధములను తెలియజేయునది. కర్తవ్యాకర్తవ్యబోధకమైనది యుపదేశశాస్త్రంబు ఇందుకు దృష్టాంతము.

రసాయనశాస్త్రంబు పాషాణముయొక్క గుణములను వివరించును శారీరశాస్త్రము ఆ పాషాణమును భుజించినచో దేహములో నేయేమార్పులు కలుగునో వానిని బ్రకటించును. ఇవి రెండును నిర్దేశ శాస్త్రములు ఇక 'బాషాణము మనుజులకు బెట్టవచ్చునా, కూడదా ? ఎందుచేత నది పాపకార్యంబని యెన్నబడును ?' అను విచారములు ఉపదేశశాస్త్రంబైన నీతిశాస్త్రమునకు సంబంధించిన విషయములు. ప్రకృతము మన యర్థశాస్త్రమును రసాయన శారీరకాది శాస్త్రములట్లు నిర్దేశశాస్త్రమని యెన్నవలయును.

కావున వాంఛల విషయమునగాని అర్ధంబుల విషయమునగాని యోగ్యతాయోగ్యతలను చర్చించుట యీ శాస్త్రమున నధిక ప్రసంగము. ఐనను మనుష్యజీవితమునకు బరమాప్తంబైన శాస్త్రము గావున నట్లుచేయకుండుట పొసగను బొసగదు. సాధ్యంబునుగాదు.