పుట:Bhaarata arthashaastramu (1958).pdf/462

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్పాదక పరస్పరవర్గములు బీడువడియున్నవనుట స్పష్టము. దీనికి హేతువులెయ్యవి? అరయుదము.

సేవకులును లాభములో బాలుగొనియుండుట యీ పద్ధతియొక్క యాధారలక్షణములలో నొకటిగదా! ఈ లక్షణ మింకను ముకుళితస్థితిలో నున్నదిగాన వికాసమునకు రామింజూడ చింతనీయము. 1889 వ సంవత్సరమున జరుపబడిన యీ సమాజములవారి సాంవత్సరికసభలో నుత్పాదక సంఘములు వృద్ధిజెందమికి గారణము లీక్రిందివని వారేయొప్పుకొనిరి. అవియెవ్వియన:-

1. ఈ సమాజములు చాల చిన్నవి. విస్తార వ్యాపారము వహింపజాలినవికావు.

2. మఱియొండొంటితో నివియు మిక్కిలి స్పర్థించుచున్నవి. బయటి కళాశాలలవలని వైరమే ప్రాణకంటకముగ నుండగా నిక దమలోదామే మత్సరముం జెందినగతియెట్లు?

3. వీనికెల్లను సంధిగల్పించి స్నేహభావమున వర్తించునట్లుచేయ గొందఱు ప్రయత్నించిరి గాని వారితలంపు కొనసాగలేదు. నిజమైన పరస్పరత యెంతోగొప్పగుణము.మాటలలో దాని వర్ణించువారు పెక్కురున్నారుగాని చేసి చూపువారిసంఖ్య యత్యల్పము.

ఇతరకారణములు మున్నే చర్చింపబడియె. ఈ యుత్పాదక సమాజములలో నిప్పటికిని జయప్రదములైన యెవ్వియన:-

1. లెస్టరు పట్టణములోని బూట్సు ఫ్యాక్టొరీ.

2. గోధుమలను బిండిచేయు ఫ్యాక్టొరీలు ఆరు. ఇవి యన్నిటికన్న బాగుగా నడుపబడుచున్నవి.

కో ఆపరేటివ్ వ్యవసాయము ఇంగ్లాండులో నింకను బ్రబలమునకు రాలేదు. కాని యైరోపాలోని యొకటి రెండు దేశములలో మంచి వృద్ధికి వచ్చియున్నది.