పుట:Bhaarata arthashaastramu (1958).pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూర్వమొక రాజు గలడు. అతడు మిగులలోభి. ధనమునకు మించినదేదియులేదని నమ్మినవాడు. అతడు ధనము నాశించి తపంబుసేయగా దేవుడు ప్రత్యక్షమయ్యెను. ఏమివరము కావలయునని దేవుడడుగగా నతడు, "స్వామీ ! నేను ముట్టినదంతయు బంగారు గావలయు " నని వేడుకొనెను. దేవుడు వల్లెయని యంతర్థానమాయెను. పిమ్మట నీరాజు మహదానందమున నింటికి వచ్చిచేరి భార్యనుజూచి తన సంపాదించిన వర మామెకు దెలిపి యుత్సాహ సూచకముగ ముద్దు వెట్టెను. వెంటనే భార్య బంగారు బొమ్మ యయ్యెను. ఇదియేమి గ్రహచారమని చింతింపుచు నాకలి కోర్వలేక పరిచారికంబిలిచి యన్నము పెట్టుమనగా నామె వడ్డించిన పదార్ధములన్నియు దినుట కారంభింప స్వర్ణ మయములయ్యె ! విధిలేని యేకాదశి యాయెగదాయని నీరు త్రావబోవ నవియును బంగారయ్యె ! పిదప నాతడు తెలివి దెచ్చుకొన్నవాడై భగవంతుని బ్రార్థించి యావరమును దొలగించుకొనెను.

తనకు సంబంధించినవియు సహజములునగు వాంఛలను పురుషుడు సులభముగ దృప్తి జెందింపగలడు. అరపడి బియ్యముకన్న నెక్కువగ నెవడును తినబోడు. నిద్రాహారములు త్వరలో మితిజెందును. విద్య, నాగరికత మొదలైన వానివలన గలుగు కోరికలను దీర్చుట యంత సులభముగాదు చిత్రకారు డెంతబాగుగ జిత్రించినను తృప్తింజెందడు. ఇంకను జక్కగ జిత్రింపలేకపోతిని గదాయని చింతించును. త్యాగము చేయుటకు మేరలేదు. మృగ సాధారణములగు విషయములయం దాసక్తి త్వరలో లాఘవ మొందును. కావ్యరచన, విజ్ఞానము, శాస్త్రవిచారణము, దేశసేవ, పరోపకారము, భగవద్భక్తి మొదలగు సర్వోత్కృష్టవాంఛ లెన్నటికిని నశింపవు. లోకమునకును మనకును శ్రేయోదాయకములైన కాంక్ష లెన్నటికిని నశింపక స్థిరముగనుంట ఎంతమేలో యోచింపుడు !