పుట:Bhaarata arthashaastramu (1958).pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇందునకు మఱియొక నిదర్శనము - పిపాసాపీడితుడైనవాడు జలము ద్రావబూనెనేని తొలిగ్రుక్కయెంతో సుఖము నొసంగును. త్రాగను త్రాగను ఈ సుఖము తఱుగుచు వచ్చును. సంపూర్ణముగా దాహమారిన పిమ్మట నింకను ద్రావబోయిన సుఖము లేకపోవుటయే కాదు కష్టము సంబవించును. ఒకబానెడునీళ్లు వానినోటిలో బలవంతముగబోసిన వాడు మృతిజెందును. 'అధికమగుడు విసంబగు నమృతమైన' నన్నట్లు వస్త్వాధిక్య మెక్కువైనట్లెల్ల క్రొత్తగా వినియోగమునకువచ్చు భాగములవలని ప్రయోజనము తగ్గుచు వచ్చును. ఈ విషయమునే ప్రక్కపటమున బ్రదర్శింతుము.

ఈ పటములో నీరు ద్రాగను త్రాగను వెనుకటి గ్రుక్కల వలని సుఖము తక్కువయగుటయు గొంతవడికి సుఖ మగోచరత్వంబు నొందుటయు ఆమీద గష్టము కనబడుటయు నింకను ద్రాగను కష్ట మెక్కుడగుటయు విస్పష్టంబు.

'ఈ వస్తువు మంచిది' అని సాధారణముగ మనము వాడు కొనుమాట కర్థ మేమనగా :- ఒక పరిమితి మీరక దొరకిన నంతయు మంచిది ; అంతకు మించిన గొన్నిభాగములు నుపయోగము లేనివి గాను నష్టకరములుగాను నుండుననుట. ఈ విషయమైన కథ యొండు గలదు.