పుట:Bhaarata arthashaastramu (1958).pdf/435

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వృద్ధియు నంతకుమున్నే యుండవు. నాకుంజూడ సర్వసమత్వము సర్వానర్ధకరమని తోచుచున్నది. క్షోభలు పెఱుగు ప్రాయమునవచ్చు జ్వరములవంటివి. వానికి హేతువు పెఱుగుటయే. అవి లేకయే పెఱిగిన నింకను మంచిదేకాని యట్లగుట స్వభావహితంబు గాదుకాబోలు!

పైని చర్చింపబడిన క్షోభలు యధార్థక్షోభలు. అనగా వర్తకులును గృష్యాది కళాప్రారంభులును దెంపు మిక్కుటమగుటచే మన:పూర్తిగ వ్యవహారములు మంచివనినమ్మి వానిలో బ్రవేశించుటచే దామును తమకు ఋణమిచ్చినవారును నిరువురుంజెడుట. మంచి యోగ్యత లేని వ్యాపారులు దొంగదివాలెత్తి తమకు నప్పిచ్చినవారిని ముంచి తాము సుఖించుట గలదు. ఇట్టి కృత్రిమతంత్రములు నక్క జిత్తులు, తఱుచుగ బ్రబలెనేని రాజ్యమున నమ్మకము చెడును. ఆర్థికస్థితులు వెలయజాలవు.