పుట:Bhaarata arthashaastramu (1958).pdf/425

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గలరు? దివాలెత్తగలరు. ఇట్లు మూలధన మధికవృద్ధి గాంచుటచే ధనసౌలభ్యమువలన జేయబడు పిచ్చివ్యవహారములవలన దుదకు నాణె మపాయస్థితికిరాగా గలుగు మహాక్షోభ మొక గండము వంటిది. ఇంగ్లాండులో నిట్టిగండములు గతశతాబ్దమున నాలుగైదుపుట్టి దేశమును స్రుక్కజేసినవి.

4. మూలధనము మిక్కిలి కొఱతవడుట దీనిచే వ్యవహారులు చాలినంత ధనము గొనుటకు గష్టమౌను గాన వడ్డి యెక్కువగ నియ్యవలసినవారై యారాట మందుదురు.

5. రాష్ట్రములోని రూప్యములు మొదలగు నాణెములు, అత్యమితములైన వెలలు హెచ్చును. దీనిచే ననేకులు ముఖ్యముగా నికరమైన యాదాయముగలవారు మిక్కిలి శ్రమపడుదురు. నాణెములు లోపమునకు వచ్చినయెడల వెలలు తగ్గునుగాన విక్రయించి జీవించు వ్యవహారులకు నష్టము తప్పదు నాణెముల రాసులయందలి న్యూనాధి కతలచే నగు నుత్పాతముల విస్తరముగ వినిమయకాండంబున వివరింతుము.

6. మూలార్థ మమితముగా స్థిరములైన యంత్రములు, ఇనుప దారులు మొదలగు వానియం దుపయుక్తంబైనచో గొన్ని సమయములలో క్షోభములు పుట్టుటయు గలదు. ఎట్లన, పూర్వము వివరించినఫక్కిని స్థిరతకొలది వానినుండి యాదాయము వెలువడుట యాలస్యమగును. ఉదా. ఇంగ్లాండులో దొలుత నినుపదారులు వేయునపుడు, అనేకులవి లాభకరంబులనుట సుప్రసిద్ధము గావున దమ ధనమును రైల్వేకంపెనీలలో నిక్షేపించిరి. లాభము సిద్ధమైనను నెంత త్వరలో నౌననుట యోచింపరైరి. వీరికి వృద్ధిభాగములు త్వరలో రానందున దాలిమి వదలినవారై కంపెనీలలో దాముకొన్న భాగముల విక్రయింతమని యందఱు బయలుదేఱినందున నాభాగములకు మంచివెలలురాక నష్టముంజెందిరి.