పుట:Bhaarata arthashaastramu (1958).pdf/412

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాసుల సిద్ధపఱచుట నిష్ప్రయోజనము. కావున వాంఛ లెందు స్థిరంబులైయుండు నెం దస్థిరములై యుండుననుట విచార్యము. చూడుడు? బోజనపదార్థములు మొదలగు నావశ్యక పదార్థముల మీద నొకమితమువఱకు నభిలాష యెన్నటికింజెడదు. ఏవియున్నను లేకున్నను ధాన్యములు, ఇండ్లుగట్టు కొనుటకు సాధనములైన నేలలు, కొయ్యలు, మన్ను, సున్నము, కొంచెముఇనుము, సాధారణ వస్తువులకు వలయు ప్రత్తి, ఇవి యుండియే తీరవలయును. ఇక నీవస్తువుల లక్షణ మేమనగా నివి పరికర్షణ కళలకుం జేరినవి. అనగా వీనియందు సవిస్తారోత్పత్తి. హీనవృద్ధి ప్రకృతి గుణంబులు వీనిచే బాధితము. మఱియు ఘనతరములు నఖండవ్యాప్తములునైన క్రియలు సాధారణముగ నలంకారకళలైన విరచిత వ్యాపారములయం దుపగతములు. ఇట్టివస్తువులయందలి వాంఛ బహుచంచలము. సముద్రములోని తరంగములకరణి లేచుచు వ్రాలుచు నుండును. దృష్టాంతము. చీరలు తప్పక యందఱు ధరింతురుగాని బనారసుచీరలే కట్టితీరవలయునను విధి ఎవ్వరికినిలేదు. తళుకుం జీరల యెడ నేడపరిమితమైన యాశయుండవచ్చును. ఇంక గొన్నినాళ్ళకిది తరహాగాదని యేమహారాణియైన స్వప్నము గనెనేని, ఆమె పల్కినపల్కులే వేద వాక్యములుగ భావించు నంగనాచు లందఱు కాశీచీరలు వలదని, ఇంకొకదానిపై తిక్కంగొందురు. ఆభరణములపాటు నీరీతిదే. నేడు తరహాయని యనిపించు కొనునది రేపు వరహాకైన బోవనిదగును.

అట్లుండుటచేత విస్తారముగ రచించుటకు జాలినయవి స్థిరమైన యాదరణకుం బాత్రములు గావు అందుచేత సవిస్తరత మితముం జెందవలసినదవును. మఱి వేనియందు నాదరణము మొత్తముమీద ననశ్వరమో యవి ప్రకృతిబద్ధంబులై యమిత విస్తారోత్పత్తికి నర్హములుగావు. అమితాసక్తియు నమితో త్పాదకశక్తియు రెండును సమంబుగ నావేశించిన వస్తువులు మృగ్యములు.