పుట:Bhaarata arthashaastramu (1958).pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లను వికారవేషము దాల్చునట్లు నిర్బంధింతురు. ఇట్లు ఏ కీడును గలుగజేయని నిష్కల్మషములగు కోరికలసయితము నిషేధించి మనుజుల జీవనంబునకు స్వాతంత్ర్యమనునది లేకుండజేయు దేశంబున నేపురుషార్థంబు గడింప నలవియగును ?

ఇక రెండవది. ఇదియు బైదానితో సంబంధించినదే. ప్రతి జాతికిని ఉపజాతికిని వెవ్వేఱ వేషవర్తనంబులు నిర్దేశింపబడి యుంట బట్టి, స్వాతంత్ర్యవర్తనముగాని, వర్తనమున కనుగుణమైన పదవిని గాని యెట్టివారునుజెందుట దుర్లభంబు. ఎంతగొప్పవాడైనను శూద్రుడు ఎట్టినీచుడైన బ్రాహ్మణునకుం దక్కువవాడుగ నెన్న బడుచున్నాడు. గుణములచేగాక జన్మమాత్రంబుచేతనే తారతమ్య మేర్పడుటచే వృద్ధిజెందవలయునను నుత్సాహమునకు భంగము గలుగుచున్నది. పౌరుషముచేత బుట్టుకను మార్ప సాధ్యముగాదు. ఇక బుట్టుకను మార్పకున్న గతిలేదు ! ఎయ్యవి పురుష ప్రయత్నంబున మార్పనగునో (అనగా గుణములు పదవి మొదలగునవి) ఆవానిని మార్పనియ్యరు. అట్లుకాదని మార్చినను లాభములేదు. కనుక ఎట్లు చూచినను మనుష్య ప్రయత్నము చెల్లునట్లు కానము. కావుననే మనవారు సర్వము దైవకృతమనియు, కర్మము ననుసరించి యుండుననియు, బూతుసిద్ధాంతములను స్థాపించి యొకవిధముగ మనసునకు సమాధానము గల్పించుకొనిరి. నిజముగా జూడబోయిన దైవ ముండుటవలన నుద్యోగము పనికిరాకపోలేదు. ఉద్యోగము లేక పోవుటంజేసి దైవమున కట్టి సత్త్వం బారోపింపబడియె.

               "ఉద్యోగినం పురుషసింహ ముపైతి లక్ష్మీ:
                     దైవేన దేయమితి కాపురుషా వదంతి
                దైవం విజిత్య కురు పౌరుష మాత్మశక్త్యా
                     యత్నే కృతే యదినసిద్ధ్యతి కోత్రదోష:"[1]

  1. "ప్రయత్నముజేయు మనుజుని లక్ష్మీ స్వయముగ వచ్చిచేరును. దైవమేమన కిచ్చుననుట చేతగానివా రాడుమాట. కావున దైవము నట్లుంచి నీశక్తి నుపయోగించి ప్రయత్న మొనరింపుము. యత్న మొనరించియు గార్యము సిద్ధింపని యెడల నది నీదోషముగాదు."