పుట:Bhaarata arthashaastramu (1958).pdf/399

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాధ్యముగాదు. అందులో బ్రబలములైనవానిం గొన్నింటి నిట జాటింతము:- మనదేశములో నరాజకము, జాతి మతాదిభేదములు, వీనిచే నమ్మిక కృశీభూతమైనది ఇప్పుడు సౌరాజ్యము గల్గియున్నను దటుక్కున నమ్మిక చిగిరించి పొదగా బెఱుగుట యసంభవము. ఐనను మునుపటికన్న గొంతమట్టునకు మేల్కని కనువిచ్చునదిగా నున్నది భాగస్థులు నేడు వ్యవహారములలో జేరిన ఱేపు వక్కీళ్ళవద్ద జేరుదురనుట యనుభవవేద్యము. "పరుల పరిపణముతో జేయు వ్యాపారముగదా! నష్టమువచ్చిననాకేమి?" యని కార్యకర్త లుపేక్ష వహించియుంటయు, నంతకుమీఱి మోసపుద్రోవల దామే యంతయు నోటవేసికొని పోవుటయు నిచ్చట నమితముగా నుండుటయకాదు, ఇంగ్లాండులోబలె నట్టివారిని హీనులని భ్రష్టులనియు బెద్దమనుష్యులు దూరస్థులంజేయుటయు లేదు. కావున నిట్టి యనుచితములు మాఱులేక జరుగుచున్నవి. ఆచారములనబడు మూఢక్రమముల మీదనుండు శ్రద్ధాజాడ్యము సత్ప్రవర్తనయందు లేమి యత్యంతము చింతనీయము. గవర్నమెంటు ఉద్యోగస్థులును విశ్వాసయోగ్యులనుట పశ్చిమ రాజ్యములలోబలె నిటజెల్లదు. లంచములు పుచ్చుకొనువారెందఱు? ఇచ్చువారెందఱు? ఆయాసము బక్షపాతముమాని యోచింపుడు! పోనీ, రహస్యముగ దీసికొనుటతో బోవునా? ఈదేశమున "మీకు సంబళమెంత? అదిగాక పైరాబడియెంత?' యని విచారించుట సహజ యోగక్షేమ విచారణలోజేరినది! తప్పులుండుటయకాదు, సిగ్గునుబోయినది. కావున గవర్నమెంటువా రేమిచేతురు? శాసనము లెంత శ్రేష్టములుగనున్నను వాని నిర్వర్తించువారు మానమర్యాదాదూరులై యున్న నేమిచేయనగును? ఈ దౌష్ట్యంబులు వేదాంతములకుం బుట్టినిల్లగు నీరాజ్యంబులో మలమల మాడుచుండుటకుం గతం బేమియనిన, జనుల స్వప్రయోజన పరత్వమును ధర్మవికలతయు నను నవియే. చూడుడు! పెద్దమనుష్యుడని పేరుగన్నవాడు, సెలవు