పుట:Bhaarata arthashaastramu (1958).pdf/392

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రమకరులును బ్రకృతము ప్రభుమార్గమే శరణ్యమని యుండు నట్లుగాన్పించెడి. ఏలన, రాజ్యాధికారము లేని సంఘముల సమయముల సభ్యులెవరైన నిరాకరించినవారిని గఠిన శిక్షలకుం బాల్పఱుచుట యశక్యము. ప్రభువుల యాజ్ఞల నిలుపుటకు సైన్యము, పోలీసుధళము న్యాయాధికారి మండలములు నున్నవి. కావున బ్రభుమార్గమున గార్యము సుఖతరముగ నెఱవేరగలదు. నిరాకరించువారిసంఖ్య యల్పమైనచో వారు దిక్కులేక వినయ వినమితు లౌదురు. ఈ సంవత్సరము, ఇంగ్లాండులో గనులలో బనిచేయువారికి, అధమపక్షవేతనములు పార్లమెంటు చట్టములచే నాజ్ఞాపించి యా శిల్పుల కృతజ్ఞత నందినది.

ధర్మము నీతి యనుపదములు సందిగ్ధములు. ప్రశస్తమైన యర్థమేదనగా. నిష్పక్ష పాతముగ నెల్లరును సములనియెంచి, మనుజులమైనందులకు మనకు సర్వోత్కృష్ట పురుషార్థమ్ము, ఎయ్యదియని విచారించి, దానింగడింప ననువగు మార్గముల నిరూపించితి మేని వానికి ధర్మము నీతులు నను నామములు చెల్లును. మనవారిలో నిట్టితత్త్వవిచారణలేకపోలేదు. కాని యది యతులకుందక్క లౌకికులకుంజెల్లదని తత్త్వాభాసము నొండు గల్పించుకొనినందునను, మఱి సంసారులకు రాజులు మతాచార్యులు మొదలగువారిచే దండబలంబున బోషింపబడు వర్ణాచారములు పరమకర్తవ్యములను సిద్ధాంతమొండు యెల్లర నావేశించినందునను, ధర్మము నీతి యనగా రాజశాసనప్రాయములైన యాచారములయని హీనార్ధముగలిగినది. మఱియు నీతి యనగా రాజతంత్రమనియు నొక భావము! లౌకికమున బెద్దలచే ధర్మము నీతి యనంబడునవి చట్టములయట్లు నిజమైన ధర్మమునకు నీతికిని విరుద్ధములై యుండవచ్చును. ఉండవచ్చునననేల? స్పష్టముగ విరుద్ధములై యన్నయవి. మన ధర్మశాస్త్రముల నొకసారి నిద్రకండ్లతో జూచిననుజాలు. ఈ యాభాసము విశదమగును. చూడుడు! ధర్మములు నీతులు! బ్రాహ్మణు డేతప్పుచేసినను దండ్యుడుగాడట! శూద్రులకు విద్దెలుచెప్పిన బాపమట! ఇయ్యవి మనువువంటి బ్రహ్మలకు మంచివని తోచునేమో! మనుష్యమాత్రులమైన మనకు భాగ్యవశంబున నట్టి దివ్యదృష్టి లేకున్నయది! వర్ణాచారములన్నియు చట్టములతో సమంబులు. ధర్మములని పేరున్నందున నామసామ్యముంబట్టి యదార్థ ధర్మములని భ్రమించి వానిని నిత్యసేవ్యము లనుట యెట్లున్నదనగా, హరియనుపదము కోతియందును బ్రయుక్తంబుగాన విష్ణువునుమఱచి కోతిని గొలిచినట్లు!