పుట:Bhaarata arthashaastramu (1958).pdf/391

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సహజవృద్ధిని నిరీక్షించువారిలో నొక గొప్ప లోపమున్నది. సహజవృద్ధి పరిఢవిల్లు రీతి యెయ్యది? ఇప్పుడు కొన్నికష్టములువచ్చిన వానిని సంస్కరించుట. మఱియు గొఱతలు గానవచ్చిన వానిని జక్కజేయుట ఇత్యాది యత్నములచేతగదా! ఈ సహజయత్నముల కొకలక్షణము సామాన్యము. ఏదన, మేలును బుట్టించుటకు దత్పూర్వముండుకీడు కారణం. కాబట్టి సహజవృద్ధిలో గీళ్ళు చిరంజీవులు! మనమే భావికాల జ్ఞానముతో సన్నాహములం జేసితిమేని, ఈకీడులు రాకయుండు నట్టి యేర్పాటులు చేయ వచ్చును గదా! అనుభవముమీద గీళ్ళదొలంగించుట బుద్ధిశాలులతనమే. నిజము. ఆ కీళ్ళ నవతారమే యెత్తనీక మూలోచ్ఛేదం సేయుట యింకను విశేషించిన బుద్ధిమత్త్వ మనుటలో నేమిసందియము? ప్రాప్తకాలజ్ఞుని కన్న దీర్ఘదర్శి శ్రేష్టుడుకాడా?

మఱియు, మనమూరకయున్న నభివృద్ధి తనంతటవచ్చి నోటిలోబడునా? పౌరుష మప్రధానమని యెంచిన హిందువులగతి లోకులు కాంక్షింపగూడినదా? హిందువు లెన్నియో యిడుమల గుడిచిరి కాని యా యిడుముల నివారింతమను నుత్సాహము గొనరైరి. కావున మన పరాక్రమములేకయ సహజశక్తులచేత గీడులు దొలంగింప బడుననుట యప్రశస్తము.

మఱియు మీరు నమ్మిన శిల్పసంఘము లాదియగు నిర్మాణములును పౌరుషోద్భూతములే. ఇంక పూర్వోద్దేశ్యము కూడదంటిరే! ఉద్దేశ్యము లేకుండవలయున నుటయు, స్వభావసిద్ధశక్తులకు యథేచ్ఛా విహారముల నొసంగవలయుననుటయు నుద్దేశ్యములుగావా?

ప్రజలు స్వయముగ సంఘముల నిర్మించుటకై చేసికొను సమయములు కూడునను వారు రాజ శాసనముల నేల తిరస్కరించుట? రాజ్యము, సంఘము, ఈ ద్వివిధ సమూహములకుం జేరినవారు శాసనములను సమయములను నతిక్రమింపక యుండుటకు సభిక బాహుళ్యముయొక్క దండన శక్తియేకదా కారణము! ఇంతేకాదు. రాజులు అడ్డులేక పాలించుకాల మెన్నడో యస్తమించినది. నాగరకతంగల దేశములలో బ్రజాప్రతినిధులే పాలకులు. అట్లగుట ప్రజలు సంఘములుగాజేరి తమకుందామ యాదేశించుకొను సంకేతములకును, ప్రతినిధులద్వారా, ఆజ్ఞాపించు చట్టములకును వ్యత్యాసము కొంచెమేకదా! చూడుడు! రెంటికిని గర్తలు ప్రజలే. ఒకదానియెడ రాజ్యాంగ మూర్తిని, ఇంకొక దానియెడ సంఘావతారముందాల్చిన ప్రజాబాహుళ్యమే యన్నిటికీం గారకము. కావున సమయములు యుక్తములు. శాసనములు అయుక్తములు. అనుట లేనిపోని భేదము గల్పించి నట్లు.

రాజ్యాంగ నిర్మాణములు పరిపూర్ణత వహింప వహింప బ్రజలే ప్రభువులౌదురుగాన బ్రజాప్రభు మార్గములు రెండును సంగమించును. అట్లగుట శాసనముల నాశ్రయించుట దోషొంబుగాదు. నిష్ఫలంబుంగాదు.

నిజము జూడబోయిన బ్రభుమార్గ సమష్టివాదులయెడ నొక కపటమంత్రము గలదు. అదియేదన, రాజ్యాంగమువారే కర్మకరులకు శాసనములచే మంచిజీతములు. విరామకాలములును నేర్పఱించి సుఖులుగనుండునట్లు చేసినవారుగలిసి యజమానులపై నెత్తివచ్చి వారిపదవి నాక్రమించుకొనరు గదాయను తంత్రాలోచన.