పుట:Bhaarata arthashaastramu (1958).pdf/377

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరిపూర్ణమైన స్వామ్యము దుర్లభము. ఎట్లనగా, మనయొక్క హక్కులెంత దుర్భేదము లైనను సర్కారువారి కొకభాగము నరికట్ట వలయుననుట యనివార్యమైన కార్యము. ఈ పన్నులు కట్టుటయేల? పన్నులు గట్టకున్న రాజులకు నాదాయము లేకపోవును. అట్లైన సైన్యము మొదలగు ప్రకృతుల నుద్ధరించుటకుగాదు. రక్షణక్రియ వెలయదు. రక్షణము లేనిచో సంఘమును దుదకు సాంఘికులును క్షీణతకువత్తురు. సంఘంనకు దండంను దండంనకు ద్రవ్యమును శరణ్యములు. ఈతత్త్వం యొక్క ముఖ్యార్థ మేమనగా దనకు నధీనములైన వస్తురాసుల యందును రాజునకు, అనగా సంఘమునకు హక్కులేక పోలేదనుట. కాననేగదా నిరాఘాట స్వామ్యంబు మృగ్యంబని యంటిమి. అట్లుండినను మొత్తముమీద నాది నీదియను కర్తృత్వము నిరవధికమై ప్రకృత మున్నదనుటకు సందియంబేల?

స్వామ్యము స్పర్ధకు నుద్ధారకము. ఎట్లన నాసంపాదితార్థము నూరివారి కెల్లరకు బంచిపెట్టవలసినదని వ్యవస్థ నేర్పఱచిన నేనేల త్రికరణశుద్ధిగ నుల్లాసముతో బనిజేతును? తనదని మనియుండ వెరవుంటం జేసికాదె కూడబెట్టుటకు నరుండు గడంగుట? అటుకాని యెడ, మొగము వ్రేలవేసికొని వేదాంతములకు దిగడా! కావున నర్థార్జనోత్సాహమునకు స్వామ్యము భద్రమైన మూలము. ఈ ఉత్సాహముయొక్క మూర్తులలో మాత్సర్యమనునది యొకటి. స్వామ్యము వలన బ్రోగుచేసి రాసులు గట్టుటలో ఫలమున్నది. ఈ ఫలంబుండుట చేత నాసలు స్పర్ధలు జ్వలించుచున్నవి.

కావున నిర్వక్రవైరము సమంజసము గాదనువారు, అఖండ స్వామ్యము ఖండితముగా గూడదని వాదింతురు. ఇయ్యది సహజమ కదా! ఈ వాదమునకు బ్రత్యాఖ్యాన మెద్దియనిన:-

స్వత్వముచే స్పర్ధ యుత్కటమౌట నిజమ. ఇందుచే గొందఱమితముగ సంగ్రహింతురు. కొందఱకు వస్తువులు చాలకపోవును.