పుట:Bhaarata arthashaastramu (1958).pdf/363

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మును బరిశీలించిన నిర్మాతలచే జోదకులు నియమింప బడుదురనుట నిజము.

ఈ చోదక సభలలో నిర్మాతలకు తప్పక స్థానముండును. సృష్టించిన వారుగాన వీరికి దెలియని మర్మము లింకెవ్వరికిని దెలియవు. వీరులేకున్న రక్షణము పదిలమా? కాదు. కావున వీరందుండియే తీఱవలయును.

నిర్మాతలు స్థిరముగ నుండువారు. తక్కిన చోదకులు మార్పబడకున్నను మార్పునకుం బాత్రులు. ఎట్లన సాంవత్సరిక భాగస్థసభలలో చోదకులెల్లరు సభ్యుల సమ్మతిమీద నియుక్తు లౌదురు. ఎట్లును నిర్మాతలం గోరికొనవలయుట పాలివారికివిధి. తదితరులను మొత్తము మీద నామోదించుటయే సాధారణమైనను, నిర్మాతలకు వారికిని సరిపడకపోయిన నొకవేళ వారిని నిరసించినను నిరసింతురు. అట్లగుట జోదకులు నిర్మాతలు చెప్పినట్టు వినుటయు బహుళము.

భాగస్థులందఱును యజమానులు. అనగా గార్యనిర్వహణమునకు వలయుధనమును వేసినవారగుట సొంతగాండ్రు. సొంతమున్నను పైవిచారణకన్న నెక్కువగా నందు వీరికిం బ్రవేశములేదు. ఎట్లన; తమకు విషయములందు బరిచయముచాలదు. రెండవది. సమష్టిగా నెల్లరుగూడు సభలదక్క ప్రత్యేకముగా నిచ్చవచ్చినప్పుడు కార్య విచారణచేయు నధికారంలేదు. ఇట్టిసభలు సంవత్సరంన నొండు రెండు కన్న నెక్కువగాగూడవు. కాబట్టి యజమానులైన భాగస్థుల ధర్మమేమనగా, కార్యము సరళముగా జరుగుచుండెనేని చోదకులనమ్మి యూరకుండుట, భంగమైన గూతలిడుట. ఇంతకన్న నెక్కువ జోలి యుంచుకొన్న నుండునదియు బోవును. కావున వ్యవహార సంఘముల నిర్మాణ మెట్టిదనగా:-