పుట:Bhaarata arthashaastramu (1958).pdf/364

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంభూయ సముత్ధాన నిర్మాణము

1. మూలధనము సన్నధముచేయు యజమానులు, అనగా భాగస్థులు, సర్వమును వీరి సమ్మతుల ననుసరించి నడుపబడుననుట యొకవిధముగా నిజమేయైనను మొత్తము మీద నిది పైమాట.

2. భాగస్థుల సమాజముచే నియమితులైన చోదకుల సభ. వ్యవహారము ఏత్రోవల బోవలయునని నిర్ణయించు నధికారము వీరిది. వీరు భాగస్థుల కుత్తరవాదులు. చోదకులలో జేరినవారలై నిర్మాత లుందురు. ఈ నిర్మాతలు పేరునకు సభ్యులలో సభ్యులుగానున్నను పరీక్షించిచూచిన చోదకమండలికి గురుప్రాయులు. వీరి యుపదేశము వేదవాక్యముగా భజించుట తగినదో తగనిదోకాని తప్పనిది. చోదకులకు భాగస్థులతోపాటు లాభములలోని పాలుగాక ప్రత్యేక వేతనములు నియతములు.

3. చోదకమండలిచే నియమింపబడిన కార్యదర్శులు (మేనేజరులు) గొప్ప వ్యవహారశాలల నుందురు. వీరు నౌకరులేగాని స్వతంత్రాధిపత్య సంపన్నులు గారు. ఏలికల యుత్తరువుల నెరవేర్చుట, ఆదాయ వ్యయముల లెక్కలను దీరుగానుంచుట, శిల్పులకెల్ల నధ్యక్షులై పనులుతీయుట, ఇత్యాదులు వీరికిం జేరిన కృత్యములు.

4. శిల్పులు, పరిచారకులు, దినదిన వేతనములకో, పనికొలది నియ్యబడు కర్మవేతనములకోనిలిచి యధ్యక్షుల మనసు ప్రకారము క్లప్తముగ గష్టించువారు.

ఇందు మొదటి రెండుతరగతులవారుమాత్రమే నాధులయ్యును మూడవ తరగతివారును శిల్పులపై బెల్లుగ నధికారముచేయువార కాన కర్తృకారయితల పరస్పరవైరచర్చలో కారయితృ లోకమునకుం జేరినవారుగా బరిగణింపబడుదురు. వీరెల్లరు నధ్యక్షులు. నాయకులు.