పుట:Bhaarata arthashaastramu (1958).pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాల్గవ ప్రకరణము

ఆధునిక వృత్తినిర్మాణములందలి సామాన్య లక్షణములు

శ్రమ విశ్లేషము - విశ్లేషము సామర్థ్యాతిశయకరము

సంఘము శరీరముం బోలినది. అంగములు ప్రత్యేకకార్యములంజేయు నవియైనను, ఆ సర్వకార్యములును సంశ్లేషింపనిది ప్రాణములకు భద్రముండదు. కార్యములు భేదించినను, ఉద్దేశ్యమొక్కటౌటంబట్టి శరీరమును ప్రధానమనియు నంగము లుపకరణ ప్రాయములైన భాగములనియు వాడుచున్నాము. ఉద్దేశ్యమున యోగమును, తత్సాధన క్రియల వియోగమును, 'ఏల ప్రవర్తిల్లెడును' అని ప్రశ్నింతు రేని, దానికి సమాధానము పూర్వనివేదితంబైన సమర్థతయే. విశ్లేషముచే సామర్థ్యమతిశయించి యుద్దేశ్యము సాధ్యమైనంత సమగ్రముగ సిద్ధికి వచ్చును.

జీవకోటులలోను నీన్యాయ మద్భుతంబుగ నిదర్శింపబడి యున్నది. ఆదిమములు నతితుచ్ఛములునైన జంతువుల నంగవిభేదము లేదు. వానికి దేహమంతయు నోరే, కన్నే, పాదమే! అనగా నన్నిక్రియలను దేహమంతయు జేయును. ఈభూతము లతిసూక్ష్మములును నత్యల్పములునై యున్నవి.

జీవములు వృద్ధినొంది పరిణమింప బరిణమింప నాయాతరగతికి జేరిన పనులకు వేఱువేఱంగము లేర్పడును. అంగములు వేఱుపడినను, ఒండొంటికి ననువుగ వర్తించుటకై మెదడావిర్భవించును. మెదడునుండి బయలుదేఱి కాయమంతయుం బ్రసరించు నరములు పగ్గముల వంటివి. ఒక కాలొకదిక్కునకును, ఇంకొకకాలు వేఱొకదిక్కునకును, ఒకకన్ను తూర్పునకు, నొంకొకకన్ను దక్షిణమునకుం బాఱకుండునట్లు, అంగములన్నియుం బరస్పరానుకూలగతిం జరియించుచు జీవసంరక్షక