పుట:Bhaarata arthashaastramu (1958).pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
  • [1] సంయుక్తోత్పత్తి పరివర్తనాది క్రియాసమాజంబుల స్థాపించుట. దీనికి యన్యోన్యతాపద్ధతి యనిపేరు. అన్యోన్యసంఘంబు లనేక విధంబులు. కర్తృకారయితృ సంయోగ సమాజములు, భోక్తౄత్పాదక సంయోగ సమాజములు, ఇత్యాదులు. వీనియుద్దేశమేమన, సర్కారువారి యధీనముగానుండక స్వేచ్ఛమై, నమితస్పర్ధవలని నష్టముల బాఱదోలుట. పైవిమర్శలోని 3, 4, 5, 6 అంకెలుగల విషయములు సమకాలికములును పరస్పర కార్యకారణ భూతములునై యున్నవి. మున్ముందు వీనింగూర్చిన వివరములు ప్రకటింపబడును.

స్పర్ధను సంక్షేపించవలసిన భారము పాశ్చాత్యులది. విక్షేపించవలసిన భారము మనది. మితమును మించిపోవుటచే వారును, మితము భావగోచరముగానియంత వెనుకబడుటచే మనమును కష్టములం జిక్కితిమి. అత్యధికముచే గలుగుబాధల నివారించుట సులభమైన కార్యముగాన పాశ్చాత్యుల కేమికొదువ? లేమిడిని పోగొట్టి పూర్ణులమౌట దుర్ఘటముగావున సాహసమే మనకు ననుష్ఠింపవలయు ధర్మము. సాహసములోను కీడులున్నవిగదాయని యత్నము లేక యుండుట రోజాపువ్వునుజూచి ముండ్లున్నవిగాయని మొగము ద్రిప్పుకొన్నట్లు. మఱియు దాటాకులదెబ్బచే మోకాలువిఱిగి కూలబడిన వారు వాయువేగంబునంబోయిన గన్నులు దిరుగునను సాకుచే కాలునకు బలములేకుంటయేమేలని సిద్ధాంతముం జేయుదురయేని, అంతకు మించిన విదూషకత్వము సృజింప గాళిదాసునకైనగాదు! స్పర్ధను సంగ్రహించు కార్యముల చింతమనకేల? అనుగ్రహించుటకుం దొడంగుదముగాక!

  1. * సంయుక్త = అన్యోన్యపద్ధతులరీతిని పొత్తికగల.