పుట:Bhaarata arthashaastramu (1958).pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరిపాటి ననుకరించి మెలగునట్లుచేయు నాధిపత్యము మెదడునకుం జేరినది. ఏకావయవమే బహుకృత్యభారము వహించినచో, మనవారు పాములంగూర్చి చెప్పునట్లు శ్రవణమున్న దృష్టి, దృష్టియున్న శ్రవణము, లేకుండుట తటస్థించి ప్రాణకంటకం బగును. ఉన్నట్టుండి భయంకరమైన యాకారమెదురదోచిన మనప్రయత్నములేకయ కాళ్ళు వెన్కకుం బోవును. సుందరాకారము దర్శన పధముంజేరిన కనులతో గాళ్ళును, ఎంతబుద్ధి చెప్పిననువినక యావంక గొంతయైన జరుగకపోదు. తటాలున నగ్గిపుల్లగీచి చేతికంటించిన నవధాన మింకొక యెడనున్నను చేయి సరుక్కున వెనుకకు లాగబడును. బాటలో బోవునప్పుడు మనసెక్కడనో చింతగొని యుండినను మనకుం దెలియకయ ముండ్లను నేత్రములు గనుగొనును. పాదములు తప్పించుకొని నడుచును. మస్తిష్కము యొక్క సంశ్లేషణశక్తికీ నిదర్శనములు చాలును.

ఏయర్థనిమిత్తమైన సంఘమైనను సరే, అభిమతమున నేకీభవించి తదనుగుణములైన పనులంబంచి కొనిచేయుట యుక్తము. ఈన్యాయ మార్థికప్రపంచమం దుపగతింజెంది యున్నదనుట గ్రామ్యాది పద్ధతులు దెలిసినవారికెల్ల సులభగ్రాహ్యంబు.

కొన్నియెడల విశ్లేషణయేలేని సంశ్లేషణ ప్రధితంబు. దృష్టాంతము. పెద్దబండ నెత్తవలయునన్న నందఱుం గలిసియే యుద్ధరింప వలయు. ఇట్టిచోటను నొకవిధమైన విశ్లేషము సిద్ధము. ఆ బండను మూల కొక్కరుగాబట్టి యెత్తుదురుగాని యందఱు నేకస్థానమున తలలం జొనుపబోరుగదా!

సృష్ట్యాదినుండి స్త్రీ పురుషుల జాడలు (అనగా నార్థిక తంత్రములు) వేఱు. గృహకృత్యములు స్త్రీలపాలిటివి. బయటిపనులో స్త్రీల నవసరపెట్టుటో పురుషులవిధి. పురాతనములైన యనాగరక జాతులలో భారములైన పనులన్నియు నారీమణుల నెత్తినగట్టి మగవారు