పుట:Bhaarata arthashaastramu (1958).pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నపారంబౌటగాదె మనము సజీవులమైయుండుట? కావున ననర్గళములన్నియు నవిశ్వసనీయములు. మేరలేని స్పర్ధ అడ్డులేని యాధిపత్యము, రెండును క్షయకారకములే. ఆరీతినే ఆధిపత్యమును, స్పర్ధయును, ఏమాత్రమును గురిగింజయంతయైనలేకున్న క్షేమంబనుటయు దెలివికి దక్కువయైన మాట. విందులో రసములట్లు క్రమమువిడువని మిశ్రత నీరెంటికిం గలుగ జేయజూచుట సర్వజనాధర ణీయము.

కొంద ఱేకచ్ఛత్రత యుత్పత్తికిని, వైరప్రభావంబు విభజనమునకు ననుకూలించు నవియని సెలవిచ్చిరి. ఇదియు దప్పే. స్పర్ధచిక్కి బిక్కరించెడు నీదేశమున దారిద్రవిభజనమున్న దేకాని యర్ధవిభజనము మఱుంగు జేరినది. స్పర్ధలేనిది, ఉత్పత్తియు క్షీణించు ననుటకు మనమే సనాతన నిదర్శనము. మనదేశములో నాచారములకు జెల్లినట్లు ఏప్రభుత్వమునకు నధికారము చెల్లబోదు. దానిచే మనము గట్టికొన్న మూటలెవ్వి, మూర్ఖతదప్ప? మఱియు నిర్మాత్సర్యమున నుత్పత్తి మేలుగా వచ్చుననుట తగునైనను మేలగుననుట యసంబద్ధ నిర్ధారణము. ఎట్లన; పోటీకివచ్చువారు లేరుగదాయని కొన్నాళ్ళకు వస్తువులగుణమును, రాశిని, పాడేలచేయగూడదు? నష్టము వచ్చునను భీతిలేనిచో గష్టమెవ్వడుపడును? మనదేశములో లాభమును నష్టమును తఱుచులేని పద్ధతియుండుటచేత నిద్రాదేవి యిది యనుకూల దేశమని యెన్నడో వచ్చిచేరినది. ఇక నష్టము లేమియుగాదు, ఖండితముగా లాభము వచ్చునను నిర్ధారణము కుదిరిన నశ్రద్ధకు నంతముండునా! నిర్వైరత నిర్వీర్యత. ఈ విషయములు ప్రకరణాంతరములకుం జెందినవయ్యు గ్రిందజూపబోవు సంగతులు చక్కగా స్ఫురించుటకై తెలుపవలసెను.

పై చర్చలవలన దేలినసంగతియేమి? స్పర్ధకు మితమేర్పఱచుట యత్యావశ్యకమనుట. ఆర్థికస్వతంత్రతకు - అనగా బ్రతివాడును దానుగోరిన ట్లుపార్జినాది కృత్యంబులకుం బరసహాయములేక తొడంగుట - నెల్ల లేర్పఱిచినంగాని దానిచే సమగ్ర సమర్థత సిద్ధింపదు.