పుట:Bhaarata arthashaastramu (1958).pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనవారు కొందఱీమాట వినినదే నవ్వునాపలేక "అయ్యో! నవనాగరకుడా! మనదేశములో నార్థికస్వతంత్రత - ఇది యొక్కటేనా? ఏ స్వతంత్రతయు లేక క్రమము దప్పకున్నాము. మమ్ము జడులని దూషించితివి. పశ్చిమదేశమువారెంతో స్వేచ్ఛగా స్పర్ధింతురు. అదియు గూడదంటివి. ఒక్కకూడదను మాటయేనా! ఏదైన నొకరీతి బంధనము లేర్పఱచ వలెనంటివి! కాలక్రమేణ అనుభవ నిర్మితములైన బంధనములు ప్రచారమునకు దేబడుననియు జెప్పితివి! దీని కేమియర్థము? ఐరోపావారును మనవలె నస్వాతంత్ర్యము నారాధింప బ్రారంభించిరనుటగాదా? కావుననే హిందూపద్ధతు లెంత ముదుసలితనము వహించినవో యంతసుందరములని నీనోటనుండియే వచ్చెగదా! మనవి యపౌరుషేయ శాస్త్రములనుటకు వేఱుప్రమాణములేల? నీపౌరుషము తెల్లవాఱినది, తెలిసినా!" అని మందలింపవచ్చునుగాన వారికి వినయముతో సమాధానము నివేదించెదము.

చెట్టు పోతరించి పెఱిగి యాకులు పూవులుమాత్రము బయట బెట్టుచు గాపునియ్యదేని దానిక్రొవ్వు నడంచుటకు వేరులు కత్తిరించుటయను దోహదముం జేతురనుట ప్రసిద్ధమేగదా! అదిగాంచి "యెంతమంచి రెడ్డియైనను ఉస్తికాయంత వెఱ్ఱి లేకపోదు" అను సామెతను నిలుపబుట్టిన వాడొకడు తనతోటలో జిగిరించుటకుం జాలక కృశీభూతమైన చెట్టునుజూచి ఆదోహదమిందునుం బ్రవర్తించునని వేరులు గోసివేసిన నాచెట్టు మఱునాడేయెండి వంటకట్టెలకుం బనికివచ్చును. అట్లే, అమితస్పర్ధచే నాక్రోశించువారు మాకు క్రమములు వలయునన్న, అమితక్రమములచే నాక్రోశించువారు - ఆక్రోశించువారా! ఆక్రోశించుటకుం దెలియనిమూఢులు - మాకు స్వతంత్రతాస్పర్ధలు వలదనుట జ్ఞానబాహిరము.

మఱియు గ్రమము లనుటచేతనే అన్నిక్రమములును నేక మగునా? ఐరోపావా రాచారబద్ధులుగానుండుట మేలనియెదరని వినం