పుట:Bhaarata arthashaastramu (1958).pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కావున మనతో మనలం బోల్చిచూచి నిన్నటికైన నేడు గొప్పయని యుదాసీనులై యుంట తగదు. మఱేమన నాగరకా గ్రేసరులైన ఇంగ్లాండు, జర్మనీ, రష్యా, అమెరికా, జపాన్, ప్రభృతిదేశస్థుల వృద్ధి వేగమునెఱింగి, వారికి మనకు నుండు భేదము నానాటికి బ్రుంగుడు వడునట్లు, త్వరితగతి సంస్కారము నెఱవేర్చినంగాని క్షాత్రగుణ ప్రథానమైన యీ కాలములో బ్రదుకు, పరువు కృశించి కాందిశీకము లౌట నిక్కువము.

పూర్వకాలమున వర్ణములు, తద్ధర్మములును, కలిసియుండినవి కాబోలు! ప్రకృతమున ధర్మములు కాలధర్మము నొందియు, జీవుడు లేని మొండెములట్లు వర్ణములు నడపీనుగులై యుండియు, పూజా మర్యాదలం బడయుటంజూడ నెంతయు వెఱగయ్యెడి. మఱియు వివేకముచే ఖండింపబడియు గతప్రాణములు గాని జాతిభేదములు గవర్న్మెంటు ఉద్యోగములు పొగబండ్లు, మొదలైన యార్థికస్థితుల ప్రభావముచే మంచువోలె విరియుచున్నవి. సర్వసమత్వము నోటిమాటలచే గాని కృత్యముల నెన్నడును జూపని జాతిశ్రేష్ఠులైన వారును రైలుబండ్లలో తురకలు మాలమాదిగలున్నను, కొసరక, కసరక ప్రక్కన గూర్చుండిపోవుచుండుట యేరికిదెలియదు? వేదాంత ప్రశంసలకన్న నార్థికస్థితులు నడవడి తీర్చుటలో గరీయంబులనుటకు నింకను సందియమేల? మాటలతీరునకు బురాణోపనిషత్తులును, వర్తనల సౌరునకు మూటలును, ఎరువువేసిన పాదులవంటివి.

వెలలు మొదలైనవి నన్యదేశములలో స్పర్థచే నిర్ధారితములు. ఏవ్యాపారమునందైన వెలలుహెచ్చి లాభము లధికమయ్యెనేని తదర్థ మితరులనేకులా వ్యాపారములం బ్రవేశింతురుగాన నుత్పత్తి విస్తరమునుగాంచి వెలల న్యూనపఱచును. ఏకారణముచేనైన నొక యురువునకు గిరాకిలేకపోయి వెలలు క్రిందికిదిగి నష్టముందెచ్చెనేని, ఆ వ్యవహారులు దానినివదిలి వేఱువృత్తుల నవలంబింతురుగాన నుత్పత్తి