పుట:Bhaarata arthashaastramu (1958).pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇట్లనుటచే దేశమున బొత్తిగా మార్పులేలేక యున్నవని వచించుట గాదు. మార్పులున్నవి. మనకాళ్ళు ఎంత పురాతన పద్ధతులలో బూడియున్నను, ఇంకను మనుష్యులమే గావున చలనశక్తి నిర్మూలముగా లేదు. మఱేమన, దాదాపు శతవత్సరము లాంగ్లేయ రక్షణమున విరాజిల్లువారమై యుండియు నింకను బురోహితులను, కులము పెద్దలను, తాతలను, అవ్వలను, బొడగన్నబులు లంగనినమాడ్కి వడవడ వడంకుచున్నారము గాని, తాటాకుల కట్టకన్న మనస్సాక్ష్యము మిన్నయని తఱుచు నడువ నేర్చిన వారము కామైతిమి. లోకమంతయు నీనాడు మాత్సర్యగ్రస్తములై కయ్యమునకు గాలుద్రవ్వుచు నొండొంటి గడవ నుంకించు రాష్ట్రములతో గూడి ప్రతాప ప్రదీప్తమై తేఱిచూడ రాకయున్నది. చొఱవయు, తెగువయు, చలము, బలము, నున్నకాలములో, నూఱేండ్లకొక యడుగు నెంతో బలాత్కారము మీద ముందుబెట్టి "అబ్బా! బహుదూరము వచ్చితిమి. ఇది యమానుష కృత్యంబుగదా! ఇంకేమి? ఇక నూఱేండ్లు సేదదీర్చికొన నిక్కడనె కన్నులు మూసికొని గుఱకలిడుదము" అను నల్పోద్యోగులకు నీపోటాపోటీలలో గతి మోక్షంబులు దక్కవు. కావున నేదోయొకింత సంఘసంస్కారమైనది గదాయని యహంభావముం గొనుట మూఢభావము. వెనుకజిక్కినవారు ముందుపోయిన వారితో గలసికొన వలయునన్న వారికన్న వేగంబునం బోయినంగాని మధ్యనుండు దూరంబు తగ్గువడదు. కావున మునుపటికన్న నొకింత వడిగల వారమైతిమని తుష్టిమై విఱ్ఱవీగుట వెఱ్ఱితనము. యుద్ధమున జయకాంక్ష శత్రుసంత్రాసకరంబైన సైన్యమున్నంగాని ఫలింపనేరదు. పరరాజులు తమ సైన్యములం బదిరెట్టులు వృద్ధిపఱతురేని, తామును నటుసేయక రెండుమూడింతలుమాత్రము ప్రబలపఱచి మునుపటికన్న నుద్దండముగ నున్నాముగదా యనువారి కుద్దండన మనివార్యము.