పుట:Bhaarata arthashaastramu (1958).pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంకీర్ణములునైనవి యెవ్వియు లేవు. పాపము! ఆకట మలమల మాడువారు క్రౌర్యములకు విధేయులై తీరవలయు. స్వగృహముల గష్టించు వారుగాన, రాజ్యాంగ విచారణకర్తలు వచ్చిచూచి, స్థితిగతుల నరసి, కఠిన హృదయులైన యజమానులం దండించి, వారిని రక్షించుటకు నవకాశములేదు. అయిన నొక్కటి. ఈ పద్ధతి చిల్లర కళలయందేకాని గంభీరమైన వానియం దలము కొననేరదు. కావున దీనిచే బాధితులగు వారిసంఖ్య యధికముగాదు. ఇది, చింపిరి బట్టలు, ఉడుపులు, పాదరక్షలు, ఇట్టివి సంస్కారంబు గావించుటయు, ప్రాత వస్తువుల నప్పటికి దళుకుగ నుండు నట్లుచేయు పురస్కార కళలలోమాత్రము గాననయ్యెడిని ఎట్లయినను ఇది దిక్కులేని వారిని మాత్రము పట్టి బాధించునది యనుటకు వేఱు ప్రమాణములేల?

వృత్తులు పరిణమించిన వనుటకు నర్థమేమనగా:- సమర్థత విషయమున నొక పద్ధతికన్న నింకొకటి వికాస గరిష్టమనియు, నట్లగుట నసమర్థోపాయముల నడంగించి చిరతరముగ నిలుచు ప్రభావ సమన్వితం బనియు భావముగాని, పూవులు కాయలట్లు వెనుకటిది పుట్టుటచే ముందటి వన్నియు విరిసి నశించున నుటగాదు. ఈ పద్ధతు లన్నియు సమకాలికములయ్యు నుండవచ్చును. ఉండవచ్చునని సందేహముగ జెప్పనేల? మనదేశములో బ్రకృత మన్నిరకముల పద్ధతులు నమరి యుండుటయ కాదు, గ్రామ్య పద్ధతియు నింకను గణ్యమైయున్నది. ఆద్యంత భేదములు గొంతవఱకుం గాలానుగుణములైనను విశేషించి ప్రాముఖ్యము ననుసరించి యుండును. వర్తమానమున నుజ్జ్వలంబైన యంత్రశాలాపద్ధతియు గొఱతలేనిది గాదు. ఈ కొఱతలే దీనిని దక్కువ పఱచి యింకను బరిశుద్ధమైన యార్థికస్థితి యావిర్భ వించుటకు నిమిత్తమాత్రమౌనేమో! ఇకముందు చర్చింతము.