పుట:Bhaarata arthashaastramu (1958).pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. దారిద్ర్యము:- మృగయాయుగమ్మున బీదతన మతినిబిడమ్ముగ నుండెననియు, తదితర యుగమ్ముల క్రమేణ తఱుగుచు వచ్చెననియు ముందే మందలించితిమిగదా! దీనికిం గతంబెయ్యది? తమకు వినియోజ్యములగు వానినెల్ల దామే సేకరింపవలయునన్న నెక్కువ ప్రోగుచేయుటకు భీమబలునికైన నలవిగాదు. వస్త్రముల నేయుట, బట్టలుతుకుట, పంటబెట్టుట, వంటచేయుట, ఇల్లుగట్టుట, అందులకు గావలసిన వెదురులు, పూరిమన్ను ఇత్యాదులను దయారుచేయుట వీని నన్నిటి నొకడే ఇతరజన సహాయములేక పరిష్కరింప బూనెనేని కల్పాంతమునకైన బనిముగియదు. ఒకపూటకైన రుచికరమగు భుక్తి లభింపదు. మనుష్యులలో నెల్లరు సుఖముగ నుండవలయునన్న సంఘమున నన్యోన్యత యుండవలయు. భిన్నవృత్తులుగాని ప్రజలున్న నన్యోన్యత యుండదు. కావున వేఱు వేఱు వృత్తుల నేర్పఱచి ఒక్కొక్కరు ఒకటిబూని పరిశ్రమించి, విశేషధనమ్ముల నార్జించి, వాణిజ్యముచే నొండొరుల కొఱతల బూరించిన కార్యసిద్ధి యగునుగాని వృత్తి విశ్లేషణములేనిచోగాదు. సంఘ ముద్ధురమగుట కేమి సాధనంబనిన - వృత్తులు విశ్లేషించి వాణిజ్యముచే సంశ్లేషించుట. ఇది యదార్థ తత్త్వము. ఈ విశ్లేష సంశ్లేషములు పరస్పరాస్పదములు.

వాణిజ్యోత్పత్తు లితరేతరాశ్రయములు

వాణిజ్యములేనిచో విశ్లేషము దుర్ఘటము. సాలెవాడు తన బట్టలకుమాఱు బియ్యమును గొనవచ్చునను నిశ్చయముండబట్టికాదె బట్టలనేయను! లేనిచో పంటలను బెట్టవలసినవాడగును. ఇక విశ్లేషణలేనిది సంశ్లేషణ యంతకుమున్నే మొనయదు. విశ్లేషణము ఉత్పత్త్యతిశయమునకు మూలము. ఉత్పత్త్యతి శయముచే గావలసిన దానికన్న నెక్కువ కర్తలకు నమరును. ఈ యధికములగు బండములే వాణిజ్యపు సరకులు.